గీతా ఆర్ట్స్ ఏం చేసినా – దాని వెనుక ఓ అర్థం పరమార్థం ఉంటాయి. ఎందుకంటే… అల్లుఅరవింద్ బుర్ర… మామూలు బుర్ర కాదు. అందుకే ఫ్లాపుల్లో ఉన్న `బొమ్మరిల్లు` భాస్కర్ని రంగంలోకి దించినా – ఏదో మ్యాజిక్ చేయించేస్తాడు అనిపించింది. ఈ దసరాకి విడుదలైన సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త బెటర్ రిజల్ట్ ని తీసుకొచ్చింది. తొలి మూడు రోజులూ మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాకి చాలా సార్లు రీషూట్లు జరిగాయని, అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువే అయ్యిందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. కాకపోతే… అల్లు అరవింద్ తన ట్రిక్కులతో బడ్జెట్ ని వీలైనంత తక్కువకే పరిమితం చేశారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా భాస్కర్‌కి పారితోషికం ఇవ్వలేదు. తను కేవలం నెల జీతంపై పని చేశాడట. నెలకు రెండు లక్షల చొప్పున ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ, ఇప్పటి వరకూ భాస్కర్ కి జీతం ఇస్తూనే ఉన్నార్ట. ఈమధ్య నెల జీతాలకు పనిచేసే దర్శకుల్ని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. కొత్త దర్శకులకు ఈ థీరీ వర్కవుట్ అయినా, భాస్కర్ తో కూడా నెల జీతానికి వర్క్ చేయించుకోవడం గీతా ఆర్ట్స్ బుర్రే బుర్ర. భాస్కర్ కి కూడా అవకాశాలు లేవు. తనని తాను నిరూపించుకోవడం చాలా అవసరం. పైగా గీతా ఆర్ట్స్ పెద్ద సంస్థ. కాబట్టి… భాస్కర్ రెండు లక్షల జీతానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ సినిమాకి మంచి రిజల్టే వచ్చినట్టైంది. లాభాలూ దక్కించుకుంటే భాస్కర్ కి మంచి గిఫ్ట్ దొరికే ఛాన్సుంది.