తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చి చేరుతున్న రెడ్డి నేతల సంఖ్య పెరుగుతోంది. జమ్మల మడుగు టీడీపీలో ప్రస్తుతం ఎలాంటి బలమైన నేతా లేరు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ లీడర్ లేకుండా పోయారు. ఈ సమయంలో ఆదినారాయణరెడ్డి సోదరుడు.. మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి , ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముహుర్తం ఖరారు చేసుకున్నారు.
జమ్మలమడుగు బాధ్యతలను భూపేష్ రెడ్డికి ఇస్తారు. అయితే ఆదినారాయణరెడ్డినే ఆయనను టీడీపీలోకి పంపిస్తున్నారన్న ప్రచారం జమ్మలమడుగులో జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనిపించేది ఎక్కువగా టీవీ చానళ్లలోనే. జీవీ రెడ్డి అనే యువ నాయకుడు ధాటిగా.. ధీటుగా వాదనలు వినిపిస్తూ ఉంటారు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నేతగా ఆయనకు పేరు ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
చంద్రబాబును కలిసి .. తన నిర్ణయాన్నిచెప్పారు. ఇరవై ఒకటో తేదీన ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల పలువురు వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారు. కనిగిరి లాంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి వచ్చి చేరుతున్నారు.