“మా” ఎన్నికల గురించి మీడియా ముందుకు ఎవరూ వెళ్లవద్దని మోహన్ బాబు మైక్ దొరికిన ప్రతీ సారి చెబుతున్నారు. కానీ ఆయన పుత్రుడు జట్టు మాత్రం ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మాట్లాడుతోంది. అదీ కూడా “మా” ఎన్నికల గురించే. వివాదాస్పద అంశాల గురించే. “మా” అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు విష్ణు కూడా తన తండ్రి మాటను జవదాటను అని ప్రకటించారు. ఇక నుంచి “మా” రాజకీయాలపై అసలు మీడియాతో మాట్లాడబోనని ప్రకటించారు. అయితే రెండు రోజుల కాక ముందే ఆయన మీడియా ముందు కావాల్సినంత సేపు మాట్లాడారు.
గెలిచిన తన ప్యానల్ సభ్యులందర్నీ తీసుకుని..మోహన్ బాబుతో సహా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో నూ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి అదే పనిగా మా ఎన్నికలపై మాట్లాడారు. అన్ని వివాదాస్పద అంశాలపై మాట్లాడారు. చివరికి బైలా కూడా మారుస్తామన్నారు. ప్రకాష్ రాజ్ అదే పనిగా చేస్తున్న విమర్శ బైలా మారుస్తారని. దీన్ని కూడా చేస్తామని మంచు విష్ణు మీడియా సమావేశంలో ప్రకటించారు. సీసీ టీవీ ఫుటేజీ వివాదం గురించి మాట్లాడారు.
ఆయన టీంలో గెలవకపోయినా .. తిరుతి దర్శనానికి వెళ్లిన బాబూమోహన్ లాంటి వాళ్లు మరింత ఘాటుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌పై విమర్శలు చేశారు. మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ కూడా సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడానికి జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు వెళ్లారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన మంచు విష్ణుతో తనకేం పేచీ లేదని.. సమస్య అంతా ఎన్నికల అధికారిలోనని చెప్పుకొచ్చారు.
ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉంది. మీడియా ముందుకు రావొద్దని.. రాబోమని నీతులు చెప్పిన మంచు విష్ణు టీమే గీత దాటి అదే పనిగా విమర్శలు చేయడం వివాదాస్పదమవుతోంది. వివాదాన్ని ముగించే ఉద్దేశం మంచు వర్గానికి లేదన్న అభిప్రాయం టాలీవుడ్లో వినిపిస్తోంది.