దళిత బంధు పథకం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లెక్కల్లో స్పష్టత ఉంది. మోత్కుపల్లి నర్సింహులకు పార్టీ కండువా కప్పే కార్యక్రమంలో దళిత బంధు పథకం విషయంలో తన పట్టుదలను మరోసారి మాటల్లో చెప్పారు. లెక్కలు కూడాచెప్పారు. వచ్చే ఏడేళ్లలో దళిత కుటుంబాలకు రూ. లక్షా 70వేల కోట్లను పంపిణీ చేస్తే వారు రూ. పది లక్షల కోట్లను సంపాదించుకుంటారని విశ్లేషించారు. మరి దళితులకు పంచడానికి రూ. లక్షా 70వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే..దానికీ సమాధానం చెప్పారు.
ఏడేళ్లలో తెలంగాణ బడ్జెట్ రూ. 23 లక్షల కోట్లు. వాటిలో నుంచి దళితులకు రూ. 1 లక్షా 70వేల కోట్లు కేటాయించడం పెద్ద సమస్యేం కాదన్నారు. దళితులకు చేయాల్సింది చాలాఉందని.. దళిత బంధు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. కేసీఆర్ వచ్చే ఏడేళ్ల లెక్క మాత్రమే చెప్పారు. అంటే రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించడం ఖాయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారని అనుకోవాలి. ఈ సందర్భంగా మోత్కుపల్లిని కేసీఆర్ పొగడ్తలతో ముచెత్తారు. తాము కలిసి పని చేసిన రోజులను గుర్తు చేశారు.
విద్యుత్ మంత్రిగా మోత్కుపల్లి పని చేశారు.. ఈ సందర్భంగా కరెంట్ కష్టాలు ఎలా ఉంటాయో మోత్కుపల్లికి తెలుసని.. అలాంటివాటిని తాము అధిగమించామన్నారు. ఇటీవల మోత్కుపల్లి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. కోటి ఖర్చయినా సరే పర్లేదు.. ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. స్పీచ్ మధ్యలో కేసీఆర్ దేశంలో తనను తిట్టినంతగా ఏ నాయకుడ్ని తిట్టలేదని చెప్పుకున్నారు. గతంలో మోత్కుపల్లి కూడా తన టంగ్ పవర్‌ను కేసీఆర్‌పై చూపించారు. కానీ మోత్కుపల్లిని ఉద్దేశించి కాకుండా జనరల్‌గా మాట్లాడటంతో మోత్కుపల్లి కూడా ఊపిరి పీల్చుకున్నారు.