చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపడుతున్నానని ప్రకటించిన వైఎస్ షర్మిల షెడ్యూల్ కూడా ప్రకటించారు. వైఎస్ఆర్టీపీని ప్రకటించే సమయంలో వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ రోజుతో వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో రేపటి నుంచి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆమె పాదయాత్రపై ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. తెలంగాణ మీడియా అసలు పట్టించుకోవడం లేదు. అనుభవ రాహిత్యం వల్ల సోషల్ మీడియాలోనూ హైప్ క్రియేట్ చేసుకోలేకపోయారు. దీంతో షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుందన్న సంగతే చాలా మందికి తెలియని పరిస్థితి ఏర్పడింది.
మొదట వారం రోజుల షెడ్యూల్ ప్రకటించారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు యాత్రను కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. పాదయాత్ర షర్మిలకు కొత్తేం కాదు. గతంలోనూ పాదయాత్ర చేశారు. 2012లో ప్రజా ప్రస్థానం పేరిట 3,112 కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలోనే నాలుగు వేల కిలోమీటర్లు తిరగనున్నారు. రేపు పాదయాత్ర ప్రారంభించేందుకు ఇవాళే ఇడుపుల పాయలో తండ్రికి నివాళులు ్ర్పించనున్నారు. షర్మిలతో పాటు తన తల్లి విజయలక్ష్మి ఉంటున్నారు. పాదయాత్రను అందరూ విజయవంతం చేయాలని ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
ఇటీవల పీకే టీం లోటస్ పాండ్‌కు వచ్చి షర్మిలతో సమావేశం అయిందన్న ప్రచారం జరిగింది. కానీ వారు పని ప్రారంభించినట్లుగా ఎక్కడా లేదు. ఆ ఇంపాక్ట్ కనిపించడం లేదు. పాదయాత్ర కోసమే వారు పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో జగన్ పాదయాత్రనూ వారే డిజైన్ చేశారు. పాదయాత్ర ప్రారంభానికి ఎలాంటి హైప్ లేకపోయినప్పటికీ.. ముందుకు సాగే కొద్ది వారే సోషల్ మీడియాలో హైలెట్ చేస్తారని ఆశిస్తున్నారు.