ఎన్ని కిలోమీటర్ల దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతందన్నట్లుగా.. పెట్రోల్, డీజిల్‌ను ఎక్కడకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అక్కడకు తీసుకెళ్లడానికి రోజూ పావలా చొప్పున పెంచుకుంటూ పోతున్నారు ప్రభుత్వాల పెద్దలు. కరోనా దెబ్బకు ఉపాధి కష్టంగా మారిపోయిన ప్రజలపై పెట్రోల్, గ్యాస్ ధరలు రోజూ పెంచతూ బతుకంటేనే భయం పుట్టేలా చేస్తున్నారు. పెట్రోల్ రేటు ఇప్పటికే లీటర్ రూ. నూట పది రూపాయలకు వచ్చేసింది. డీజిల్ ధర కూడా అదే రేంజ్లో పెంచుతున్నారు. ఇక వంట గ్యాస్ ధర రూ. వెయ్యికి చేరువగా వచ్చేసింది. సబ్సిడీ రూ. ఇరవై కూడా రావడం లేదు.
ఐదేళ్ల కిందట పెట్రో పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 70 వేల కోట్లు వస్తే ఇప్పుడు అది రూ. నాలుగు లక్షల కోట్లకు చేరింది. ఇదంతా వినియోగం పెరగడం వల్ల కాదు.. పన్నులు.. రేట్ల పెంచడం వల్ల. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకం పెంచుతూ పోయారు. ఇప్పుడు పెరుగుతూంటే ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కానీ పన్నులు తగ్గించడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు ఒక్క రూపాయి పెరిగినా సామాన్యుడిపై పడేది ఆ ఒక్క భారం కాదు.. నిత్యావసరల వస్తువుల భారం మొత్తం పడుతుంది.
ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల్ని పట్టి పీడించే స్థితికి వెళ్లిపోయాయి. ప్రజల్ని కులం, మతం , వర్గం మత్తులో ఉంచేసి తమ పని తాము చేసుకుంటున్నాయి. ఫలితంగా దేశంలో పేదలు పెరిగిపోతున్నారు. మధ్యతరగతి జీవుల జీవనం కష్టం అయిపోతోంది. ప్రజలు మరింత పని చేసుకుని పన్నులు కట్టడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప.. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కూడా దేశంలో లేకుండా పోయింది.