దుబాయ్‌లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్‌లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. ” మోకా ” ప్రకటనలు కూడా టీవీల్లో హోరెత్తుతున్నాయి. అటు పాకిస్తాన్లో ఇటు ఇండియాలో కూడా ఈ మ్యాచ్‌పై ఎక్కడా లేనంత ఆసక్తి ప్రారంభమయింది. 24వ తేదీన మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఆ మ్యాచ్ ఎలా జరుగుతుంది అన్న అనుమానాలను వ్యక్తం చేయలేదు. చివరికి పాకిస్తాన్లో కూడా. కానీ ఇండియాలో మాత్రం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం ఏమిటి అనే అభిప్రాయం మొదటి సారి వినిపించింది. అలా చెప్పింది ఈ సారి హిందూత్వ పార్టీలు అయిన శివసేన లాంటివి కావు.. ముస్లింల ఓట్లను నమ్ముకున్న మజ్లిస్.
మజ్లిస్ అధినేత ఓవైసీ పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కశ్మర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలను శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు హత్యచేశారు. ఇలా గడిచిన నాలుగు వారాల్లోనే ఐదుగురు స్థానికేతరులను ఉగ్రవాదులు చంపేయడం అక్కడి వలస కూలీల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఓవైసీపీ మ్యాచ్ ఎందుకు అంటున్నారు. ఓవైసీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకూ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడవద్దని హెచ్చరికలు జారీ చేసింది.. పిచ్‌లు తవ్వేసింది శివసేన లాంటి హిందూత్వ పార్టీలు.. హిందూత్వ సంస్థలే. తొలి సారిగా ఓవైసీ మ్యాచ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.