తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహంతో ప్రజలే దాడి చేశారని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు దాడులు జరుగుతున్న సమయంలోనే ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అచ్చంగా వైసీపీ నేతలు చేసిన ప్రకటన తరహాలోనే డీజీపీ ఆఫీసు నుంచి కూడా ప్రకటన రిలీజయింది. రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆవేశాలకు లోను కావొద్దని డీజీపీ ఆఫీసు ప్రకటించింది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని.. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని డీజీపీ ఆఫీస్ కోరింది.
టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలు వచ్చి దాడి చేశారని డీజీపీ కార్యాలయం చెబుతోది. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. పదుల సంఖ్యలో కార్లలో కర్రలు, రాడ్లతో దుండగులు వచ్చి దాడులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అంత సేపు దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. మొత్తంగా చూస్తే ఏపీలో వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతలు రెచ్చగొట్టినట్లుగా.. టీడీపీ నేతలు నిరసనలు చేపట్టినా చట్టాలు ఉల్లంఘించినట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.