ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు తిట్టిన విషయాన్ని.. ప్రత్యేకంగా స్క్రిప్టులు పంపించి మరీ తిట్టించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మర్చిపోయారో లేకపోతే బయట ఎవరికీ తెలియదనుకున్నారో కానీ ఇప్పుడు చేతకాని దద్దమ్మలే తిడతారని తీర్మానించేశారు. తమను పట్టాభి అత్యంత దారుణంగా తిట్టారని దానికి తగ్గట్లుగానే రియాక్షన్ వచ్చిందని చెప్పడానికి ప్రెస్మీట్ పెట్టిన ఆయన ఎవరికీ తెలియని కొత్త విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచారు.
బోషడికే అంటే తిట్టు అని తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు కానీ.. దాని అర్థంపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ గూగుల్లో సెర్చి కొట్టి “కోరా”లో వచ్చిన ఆన్సర్ను ప్రింట్ తీసుకొచ్చి మీడియాసమావేశంలో చదివి వినిపించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని బోషడీకే అని తిట్టారని.. ఆ పదం ఉత్తరాదిలో చాలా బూతు పదమన్నారు. ఒక సారి కాదని పదే పదే ఆ మాట అన్నారని మండిపడ్డారు. నిజానికి ఉత్తరాదిలో ఆ పదానికి ఆ ఆర్థం ఉందని ఏ డిక్షనరీలోనూ లేదు. తెలుగు జఫ్పా అనే తిట్టు ఎలానో..అక్కడకూడా అర్థం లేని తిట్టు అని చాలా మంది చెబుతూంటారు. అయితే “కోరా” వెబ్సైట్లో వచ్చిన ఆన్సర్ను చూసి వైసీపీ నేతలకు ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లుగా ఉంది.
ఇక ముందు అర్థం పర్థం లేకుండా దారుణంగా తిడితే ఇలాగే రియాక్షన్ ఉంటుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రిని అలా తిట్టారు కాబట్టే రియాక్షన్ వచ్చిందన్నారు. మొత్తం ఘటనకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. ఆయనే బాధ్యత తీసుకోవాలన్నారు. అసలు ఆ మాటే అనకపోతే ఎలాంటి వివాదం ఉండేది కాదన్నారు. ఆ మాట అనబట్టే ఈ రియాక్షన్ వచ్చిందన్నారు. మొత్తానికి చేతకాని దద్దమ్మలే తిట్లు అందుకుంటారని సజ్జల ఓ నిజాన్ని మాత్రం అంగీకరించారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.