ఈమధ్య మంచి బజ్ తో విడుదలైన సినిమాల్లో `మహా సముద్రం` ఒకటి. ఆర్.ఎక్స్ 100 తరవాత అజయ్ భూపతి తీసిన సినిమా ఇది. దానికి తోడు ట్రైలర్లు, టీజర్లూ అదిరిపోయాయి. దాంతో.. మహా సముద్రంపై అంచనాలు పెరిగిపోయాయి. తీరా చూస్తే… సినిమా డిజాస్టర్ అయిపోయింది. నెగిటీవ్ రివ్యూల ప్రభావంతో – వసూళ్లు ఢామని పడిపోయాయి. 28 కోట్ల సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు కూడా రాలేదు. దాన్ని బట్టి.. ఎంత పెద్ద ఫ్లాపో ఊహించుకోవొచ్చు.
కానీ ఏకే ఎంటర్టైన్మెంట్స్.. స్వల్ప నష్టాలతో ఊపిరి పీల్చుకుంది. దానికి కారణం.. ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కారణం. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే… నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని కైవసం చేసుకుంది. ఏకంగా 9.5 కోట్లతో ఓటీటీ హక్కుల్ని దక్కించుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 3.5 కోట్లు వచ్చాయి. శాటిలైట్ రూపంలో మరో 5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే.. నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలోనే.. 18 కోట్లు వచ్చేశాయన్నమాట. సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ అమ్మేశారు కాబట్టి.. సరిపోయింది. ఇప్పుడైతే – అందులో సగం కూడా వచ్చేది కాదు. అలా నాన్ థియేటరికల్ రైట్స్ నిర్మాతల్ని రక్షించాయి. లేదంటే మహా సముద్రం పుణ్యాన.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మునిగిపోయేదే.