తాజాగా పట్టాభి వ్యాఖ్యల కారణం గా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న జగడం ప్రజల కి విస్మయం కలిగిస్తోంది. పోలీసుల సంస్మరణ దినం సందర్భం గా ముఖ్య మంత్రి జగన్ కూడా ఇదే అంశం పై స్పందించి తన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నేతలు వాడవలసిన భాష పై ఆయన హితవు పలికారు. అయితే నెటిజన్లు జగన్ తీరు పై భిన్నం గా స్పందించారు. కేవలం తన తల్లిని తిట్టిన వారిని మాత్రమే కాకుండా ఇటు వంటి భాష ప్రయోగించిన ఇతర నేతల పై కూడా జగన్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు దేశం పార్టీ నేత పట్టాభి జగన్ పై వాడిన భాష ఊహించినట్లుగానే ఆ పార్టీ నేతలకు కోపం తెప్పించడం, తెలుగు దేశం పార్టీ కార్యాలయాల పై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దాడులకు తెగబడడం, పట్టాభి ని పోలీసులు అదుపు లోకి తీసుకోవడం, చకచకా జరిగిపోయాయి. పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా మాట్లాడిన జగన్ తన తల్లిని తెలుగు దేశం పార్టీ నేతలు బూతులు తిట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి బూతులు తిట్టడం సబబేనా అంటూ ఆయన ప్రశ్నించారు. మరొక రకంగా చెప్పాలంటే పట్టాభి పై పోలీసులు తీసుకున్న చర్యలను మాత్రమే కాకుండా, టిడిపి కార్యాలయం పై తమ పార్టీ కార్యకర్తలు చేసిన భౌతిక దాడుల ని కూడా పరోక్షంగా సమర్థించారు.
అయితే నెటిజన్లు ఇటీవలి కాలంలో ఇతర పార్టీల నేతల పై వైఎస్ఆర్సీపీ వారు చేసిన వ్యాఖ్యలను కూడా జగన్ కి గుర్తు చేస్తున్నారు. కాకినాడ వైఎస్ఆర్సిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్టాభి కంటే దారుణమైన, సభ్య సమాజం తల దించుకునే వ్యాఖ్యలను చంద్ర బాబు పట్ల , పవన్ కళ్యాణ్ పట్ల చేశారని , మరి ఆయన పై జగన్ ఎటు వంటి చర్యలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వైకాపా నేత కొడాలి నాని చంద్రబాబు ని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు అన్న పదాలను పదే పదే వాడినప్పుడు, అంత కంటే దారుణమైన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తూ కనీసం ఇప్పుడైనా జగన్ కొడాలి నాని పై చర్యలు తీసుకుంటారా అని వారు అడుగుతున్నారు. మంత్రి అనిల్, వల్లభనేని వంశీ, రోజా తదితరులు గతంలో ఇతర పార్టీల నేతలను ఉద్దేశించి చేసిన అత్యంత చవక బారు వ్యాఖ్యలను కూడా వారు జగన్ కు గుర్తు చేస్తున్నారు.
అంతే కాకుండా మొన్నటికి మొన్న వైఎస్ఆర్సిపి నేత మరియు నటుడు అయిన పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ తల్లిని ఈ విధంగా విమర్శించినప్పుడు జగన్ ఎందుకు స్పందించ లేదని, తమ పార్టీ నేతలను ఎందుకు కట్టడి చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా వీటన్నింటికి మించి శ్రీ రెడ్డి అనే వై ఎస్ ఆర్ సి పి అభిమాని చేత పవన్ కళ్యాణ్ తల్లి ని అన రాని మాటలు అనిపించినప్పుడు వైఎస్ఆర్ సిపి నేతలు పరోక్షం గా దానిని సమర్థించిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ, ” as you sow, so you reap” అన్న రీతిలో వైఎస్ఆర్సిపి నేతలు తాము ఎటువంటి భాష వాడారో అదే భాష తమ మీదకు తిరిగి వస్తుందని నెటిజన్స్ విశ్లేషిస్తున్నారు. జగన్ సైతం చంద్ర బాబు ని గతంలో నడి రోడ్డుపై కాల్చి వేయమని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి ని సైతం వారు గుర్తు చేస్తున్నారు.
మరి నిజంగానే ఇతర పార్టీల నేతల పై బండ బూతులతో విరుచుకు పడ్డ తమ పార్టీ నేతల పై కూడా జగన్ చర్యలు తీసుకుంటారా లేక గురివింద గింజ లాగా ఇతర పార్టీల నేతలకు మాత్రమే సూక్తులు చెబుతారా అన్నది వేచి చూడాలి.