హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడించడానికి హరీష్ రావు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి గ్యాస్ బండను నమ్ముకున్నారు. ప్రజల్లో ఈటలపై వ్యతిరేకత పెంచాలంటే గ్యాస్ రేట్లను హైలెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈటల పోటీ చేస్తోంది బీజేపీ తరపున కాబట్టి.. గ్యాస్ బండ ధరలను పెంచుతోంది బీజేపీ కాబట్టి.. ఆ వైపు నుంచి నరుక్కు రావాలని ప్లాన్ చేసి అమలు చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా గ్యాస్ బండను తీసుకెళ్తున్నారు. సభల్లో దాన్నే ప్రదర్శిస్తున్నారు. వాహనంలోనూ ఓ గ్యాస్ బండ ఉండేలా చూసుకుంటున్నారు.
గ్యాస్ ధర సామాన్యులకు భారంగా మారిన మాట నిజమే. సిలిండర్ ధర రూ. వెయ్యికు చేరువ అయింది. కానీ సబ్సిడీ మాత్రం రూ. 30 కూడా ఇవ్వడం లేదు. ఇది ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కల్పిస్తోంది. ఆ ఆగ్రహం మొత్తాన్ని ఈటల వైపు మళ్లించగలిగితే తన పని సులువు అవుతుందని హరీష్ రావు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈటల రాజేందర్ బీజేపీ ప్రస్తావన ఎక్కువ తీసుకు రావడంలేదు. టీఆర్ఎస్‌లో తనకు జరిగిన అన్యాయం.. తను ఆ ప్రాంతానికి చేసిన సేవల గురించే ఎక్కువగా చెబుతున్నారు.
మరో వైపు ఈటల వర్గీయులు హరీష్ ప్రచారాన్ని రివర్స్ అయ్యేలా చేస్తున్నారు. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్యాస్ సిలిండర్ గుర్తు వచ్చింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున హరీష్ ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఈటల వర్గీయులు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతూండటంతో టీఆర్ఎస్ వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. మొత్తంగా రాజకీయ ఎత్తులు.. పై ఎత్తులతో హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది.