హుజురాబాద్ ఉపఎన్నికలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని.. కాంగ్రెస్ అభ్యర్థిని గాలికొదిలేశారన్న విమర్శలు వస్తూండటంతో టీ పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. శుక్రవారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈటల లేకపోతే టీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఉనికి చాటుకోవడం కష్టంగా మారింది. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇంటికో ఓటు అంటూ ప్రచారం ప్రారంభించారు.
ఇంట్లో ఎంత మంది ఉన్నా.. ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ ఒక్క ఓటే ప్రభుత్వంపై పోరాటాలకు ఉపయోగపడుతుందంటున్నారు. ఈ ప్రచారం సక్సెస్ అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వస్తాయి. అది ఓటమి అయినా కాంగ్రెస్ పార్టీకి గెలుపులాగే ఉంటుంది. ఈటల విషయంలో ఇప్పటికే అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. ఆయనకు సహకరించడానికే బలమూరి వెంకట్‌ను రంగంలోకి దింపారని ప్రచారం చేస్తున్నారు. చివరికి టీఆర్ఎస్ నేతలు కూడా అదే చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఓటర్లు కూడా ఆయన వైపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల తర్వాత ఈటల, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఇప్పటికే జోరుగాప్రచారం జరుగుతోంది. వారు వస్తారో రారో కానీ అలా ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగి.. ఈటలకు ప్లస్ అవుతోంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకు నష్టం జరుగుతుంది.దీన్ని ఒక్క ఓటు కాన్సెప్ట్‌తో రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి !