టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన కొన్ని తీర్మానాలు ఆ పార్టీ క్యాడర్లో కొత్త చర్చకు కారణం అయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో లేనప్పుడు అన్ని నిర్ణయాలను వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చని పార్టీ నియమావళిలో మార్పులు చేశారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. మరి ఈ కొత్త సవరణ ఎందుకు చేశారన్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా కేటీఆర్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.
నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్నీ చక్క బెడుతున్నారు. ఓ రకంగా కేసీఆర్ పార్టీ గురించి అత్యున్నత విషయాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటున్నారు. మిగతా వ్యవహారాల్నీ కేటీఆరే చక్కదిద్దుతుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్కు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ నియామవళిలో మార్పులు చేయడం ఏమిటన్నది ఆ పార్టీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. బహుశా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి ఢిల్లీకి వెళ్లినా పార్టీకి అధ్యక్షుడిగానే ఉంటారని.. కానీ ఇక్కడ మాత్రం కేటీఆరే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అధ్యక్షుడి నిర్ణయాలన్నీ తీసుకునే వెసులుబాటు కల్పించడానికి ఈ సవరణ చేశారని కొంత మంది భావిస్తున్నారు.
కేసీఆర్ అందుబాటులో ఉండని సందర్భం ఏమీ ఉండదని .. ఢిల్లీ వెళ్లడం తప్ప .. ఇక ఏమీ ఉండదని వారు అంటున్నారు. కేటీఆర్కు ఎక్కువ పవర్స్ కల్పించడానికి ఇంతకు మించిన కారణం టీఆర్ఎస్ నేతలకు కూడా కనిపించడం లేదు. అసలు ఈ సవరణ ఎందుకు చేశారో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.