హుజురాబాద్‌లో ఈటల గెలిచినా ప్రజలకేం రాదని.. అదే టీఆర్ఎస్ను గెలిపిస్తే పెన్షన్లు, పథకాలు వస్తాయంటూ హరీష్ రావు చేస్తున్న ప్రచారానికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మేనిఫెస్టోను ప్రమాణపత్రం పేరుతో ప్రకటించింది. అయితే అందులో అన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే ఉన్నాయి. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే అండర్ పాస్‌ల నిర్మాణం, 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్, విద్యాలక్ష్మి పథకం, బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ రక్షిత మంచి నీరు ఇలా కేంద్ర పథకాలను ఏకరవు పెట్టారు.
తెలంగాణలో విపక్ష పార్టీలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హామీలు ఇవ్వలేరు కాబట్టి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చారు. నిజానికి బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినవి. ఎంపీలు మాత్రమే ఆయా పనులు చేయించగలుగుతారు. అదీ కూడా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థి అయిన ఈటలను గెలిపిస్తే కేంద్ర పరిధిలోని అభివృద్ధి పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను హుజురాబాద్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
హుజురాబాద్‌లో ప్రచారం చివరి దశకు వచ్చింది. 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తొలి సారిగా 72 గంటల ముందే ప్రచారాన్ని ముగిస్తున్నారు. ఈ కారణంగా బుధవారంతోనే ప్రచార గడువు ముగియనుంది. ఈటల గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ నేతలు ఎవరూ రాకపోయినా చివరి దశలో బండి సంజయ్, ఎంపీ అరవింద్ లాంటి వాళ్లు సీరియస్‌గా పని చేస్తున్నారు.