బద్వేలు నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి ఓట్లన్నింటినీ గుంపగుత్తగా కమలం పార్టీ గుర్తుపై పడేలా చేసుకుని.. తమ పార్టీ మెరుగుపడిందని చెప్పుకోవాలనుకుంటున్న బీజేపీ .. సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతలందర్నీ బద్వేలులో మోహరించారు. జాతీయ పదవులు ఉన్న పురందేశ్వరి .. తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి మురుగన్ కూడా వచ్చి ప్రచారం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ వ్యవహారాలకు తానే పెద్ద అన్నట్లుగా వ్యవహరించే కిషన్ రెడ్డి మాత్రం ప్రచారానికి వెళ్లలేదు.
ఆయన హుజురాబాద్‌పై పెట్టిన దృష్టి కూడా తక్కువే. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రెస్మీట్లు పెట్టి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఈసీకి వైసీపీపై ఫిర్యాదులు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మంత్రులపై ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నియోజకవర్గంలో ఎంత ప్రచారం చేస్తున్నారో కానీ మీడియాలో మాత్రం తరచూ గంభీరమైన ప్రకటనలతో కనిపిస్తున్నారు.
బద్వేలులో బీజేపీని గెలిపిస్తే అన్ని సమస్యలు ఇట్టే పరిష్కరించేస్తామని చెబుతున్నారు. బీజేపీ నేతలు తమ బలం పెరిగిందని చెప్పుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని ఏ మాత్రం వదిలి పెట్టడం లేదు. శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నా.. ప్రచారంలో పెద్దగా హడావుడి లేదు. ఇంత చేసిన తర్వాత కూడా బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తే మాత్రం ఉన్న పరువు పోతుంది.