జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్రగ్స్ అంశంపై తొలి సారిగా స్పందించారు. దేశంలోనే గంజాయికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ సమస్యను తాను ఇప్పటి నుండి కాదని గతంలో తాను ఒరిస్సా-ఆంధ్రా బోర్డర్లో పర్యటించినప్పుడే గుర్తించానని దానికో వీడియోను జత చేశారు. అలాగే ఏపీ నుంచే గంజాయి దేశం అంతా సరఫరా అవుతోందని నల్లగొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యలను కూడా మరో ట్వీట్లో వివరించారు. అనేక మంది డ్రగ్స్ లార్డ్లతో ఏపీ నిండిపోయిందని పవన్ ఆరోపించారు. దేశంపై ప్రభావం చూపుతుందని సమస్యను ప్రభుత్వ పెద్దలు దాచిపెడుతున్నారని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ గంజాయి, డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి పోరాటం చేస్తోంది. దీనికి సంబంధించి ప్రశ్నించామని చెప్పేతమపై దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ గంజాయి అంశంపై ఎవరు మాట్లాడినా ఆధారాలివ్వాలంటూ వారి ఇళ్లకే పోలీసుల్ని పంపుతోంది. దీంతో మాట్లాడటానికి ఎక్కువ మంది జంకే పరిస్థితి. జనసేన పార్టీ ఇప్పటి వరకూ డ్రగ్స్ అంశాన్ని హైలెట్ చేయలేదు.
ఇప్పుడు అనూహ్యంగా డ్రగ్స్ అంశాన్ని పవన్ కల్యాణ్ టేకప్ చేస్తున్నారు. అంటే టీడీపీ వాదనతో ఏకీభవించినట్లే అవుతుంది. బీజేపీ మాత్రం ఇంత వరకూ ఏపీలో డ్రగ్స్ అంశం గురించి పట్టించుకోలేదు. డ్రగ్స్ అంశంపై జనససేన మరింత విస్తృతమైన ఆందోళనలకు శ్రీకారం చుడితే ఏపీలో రాజకీయం మరింత రాజుకునే అవకాశం ఉంది.