తెలంగాణ రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి రెండు రోజులు ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో రాజకీయ పార్టీలు ప్రయత్నించలేదు. ఓ పార్టీ ఫేక్ లెటర్లను ప్రచారం చేస్తే.. మరో పార్టీ దమ్ముంటే నేరుగా తలపడాలని సవాల్ చేయడానికి సరిపోయింది. ఈటల రాజేందర్ ఫిర్యాదు చేసినందునే దళిత బంధును నిలిపివేశామని ఎన్నికల సంఘం చెప్పిందంటూ ఓ లేఖ హఠాత్తుగా వైరల్ అయింది. నిజానికి ఈసీ ఎప్పుడూ అలాంటి సమాచారం ఆర్టీఐ చట్టాల ద్వారా ఇవ్వదు. దానికో పద్దతి, ఫార్మెట్ ఉంటుంది. కానీ అందులో నేరుగా ఈటల రాజేందర్ పేరు చెప్పడంతో ఆ లేఖను టీఆర్ఎస్ వర్గాలు విపరీతంగా వైరల్ చేశాయి. దానిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో కాదని.. దమ్ముంటే నేరుగాపోటీ పడాలని సవాల్ చేశారు. ఇది ఫినిషింగ్ టచ్ మాత్రమే.
హుజురాబాద్ వార్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ఫేక్ ప్రచారాల హోరు సాగుతోంది. కొద్ది రోజుల కిందటే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముస్లింలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ ఓ పోస్ట్ వైరల్ అయింది. దానిపై ఖండనలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీ నేతలకు ఏర్పడింది. ఆంధ్రజ్యోతి పేరు మీద రావడంతో . .ఆ పేపర్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే… ఈటల రాజేందర్ కేసీఆర్ ను క్షమాపణ కోరినట్లుగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. దానిపై రచ్చ అయింది.
తర్వాత ఓ సామాజికవర్గాన్ని ఈటల బావమరది అవమానించిటన్లుగా వాట్సాప్ స్టేటస్లు .. ఆడియో టేపులు ఇలా రకరకాలుగా బయటకు వచ్చాయి. తాజాగా దళిత బంధు ఆపాలంటూ ఈటల లేఖ రాశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించారు. ఫేక్ పోస్టులు రావడం.. వెంటనే టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం .. బీజేపీ నేతలు ఖండించడం జరుగుతూనే వచ్చాయి. చివరికి ప్రచారం కూడా అదే ఫేక్ లెటర్‌తో ముగిసింది.