ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి అనే ఇద్దరు నిర్మాతలతో కలిసి నాగార్జున ప్రత్యేక విమానంలోవచ్చి తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత నాగార్జున, ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డిలతో సీఎం జగన్ లంచ్ మీటింగ్ నిర్వహించారు. అయితే వారు ఎందుకు వచ్చారన్నదానిపై స్పష్టత లేదు. వీరిద్దరిలో నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తరపున అక్రమాస్తులు కేసులు వాదించే లాయర్. ఆయన ప్రస్తుతం చిరంజీవి హీరోగా నిర్మితమవుతున్న ఆచార్య సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరు.
నాగార్జునతో పాటు జగన్‌ను కలిసిన వారిలో మరొకరు ప్రీతం రెడ్డి. ఆయనేమి సినిమాలు తీశారో ఎవరికీ తెలియదు కానీ.. నాగార్జునకు చెందిన ఎన్. కన్వెన్షన్ సెంటర్ మేనేజినింగ్ పార్టనర్‌గా మాత్రం చాలా మందికి తెలుసు. జగన్‌తోనూ నాగార్జునకు చాలా వ్యాపార వ్యవహారాలు ఉన్నాయన్న గుసగుసలు ఉన్నాయి. కానీ అధికారికంగా ఎలాంటివి బయటకు తెలియవు. జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసుల్లో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జునకు అత్యంత ఆప్తుడు. వ్యాపార భాగస్వామి కూడా.
నిమ్మగడ్డ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడు నాగార్జున తరచూ వెళ్లి ములాఖత్ అయ్యేవారు. వ్యక్తిగత పనుల వల్ల కలవడానికి వచ్చారా లేక సినిమా రంగ సమస్యలపై చర్చించడానికి వచ్చారా అన్నదానిపై స్పష్టత లేదు. సినిమా రంగ సమస్యలపై చర్చించడానికి వస్తే ఒక్కరే రారని.. కొంత మంది ప్రముఖుల్ని తీసుకుని వచ్చే వారని అంటున్నారు. పూర్తిగా వ్యక్తిగత సమావేశంగా భావిస్తున్నారు.