న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ మహాపాదయాత్ర చేయాలనుకున్న అమరావతి రైతులకు అనుమతి ఇచ్చేందుకు డీజీపీ గౌతం సవాంగ్ నిరాకరించారు. వారు పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని కారణం చెప్పి అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని సవాంగ్ కారణం చెప్పారు. మామూలుగా అయితే పోలీసులు అనుమతి ఇవ్వబోమని అని చెప్పరు. సైలెంట్‌గా ఉండేవారు. కానీ పోలీసులు అనుమతిఇవ్వడం లేదని రైతులు కోర్టుకెళ్లారు. గురువారం సాయంత్రంలోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఐదు గంటలకు అనుమతి ఇవ్వబోమని డీజీపీ సమాచారం పంపారు.
అమరావతి జేఏసీ నేతృత్వంలో సాగే ఈ పాదయాత్రకు విరాళాలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించి డిసెంబర్ 17వ తేదీన ముగియనుంది. ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు దాదాపుగా రెండేళ్లుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు పాదయాత్రలో వివరిస్తామని రైతులు అంటున్నరాు.
మహా పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం అమరావతి రైతుల మహాపాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతును ప్రకటించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా గురువారంరైతులను పరామర్శించి మద్దతు తెలిపారు. అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తున్నా.. రైతులు రోడ్డెక్కకూడదని పోలీసులు భావిస్తున్నారు. కోర్టుకెళ్లి పర్మిషన్ తీసుకోవాలని రైతులు నిర్ణయించుకున్నారు.