మాటకంటే ముందు ఏపీలో పోటీ చేస్తామని ప్రకటనలు చేసే కేసీఆర్కు వైసీపీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ” రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా” అని కేసీఆర్కు సలహా ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించాలన్నారు.
తెలంగాణలో వెలుగులు ఉంటే ఏపీలో చీకట్లు ఉన్నాయని.. ఏపీ ప్రజల తలసరి ఆదాయం కంటే తెలంగాణ ప్రజల తలసి ఆదాయం చాలా ఎక్కువ అని కేసీఆర్ సభలో వ్యాఖ్యానించారు. అయితే ఏపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల విషయంలో వైఎస్ఆర్సీపీ ఆచితూచి స్పందిస్తోంది. బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని స్పందించారు. ఆయనకు మించి ఘాటుగా పేర్ని నాని సమాధానం ఇచ్చారు. రెండు రాష్ట్రాలను కలిపేయాలని సూచించారు. కేసీఆర్ ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని.. ఏదో వ్యూహంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు భావించడం వల్లనే కాస్త ఘాటుగా ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండు రాష్ట్రాలను కలిపితే ఏపీలోనూ పోటీ చేయవచ్చన్న పేర్ని నాని వ్యాఖ్యలు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే ఏర్పడిన టీఆర్ఎస్ మౌలిక సిద్ధాంతానికి ఏపీలో పోటీ చేయడం.. ఏపీలో పార్టీ పెట్టడం అనేది సరిపడదని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు స్పందిస్తే మాత్రం రెండు పార్టీల మధ్య రచ్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.