” ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది ” అని మనం ఇప్పటి వరకూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ చైతన్యం రావాల్సిన కోణంలో కాక ఎవరూ ఊహించిన విధంగా వస్తోంది. ఫలితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. దానికి సాక్ష్యం తెలంగాణలో జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికనే. ఒక్క ఓటుకు రూ. ఆరు నుంచి రూ. పది వేలు పంచుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎంత కస్ట్‌లీగా మారిపోయిందో… ప్రజాస్వామ్యం అంటే కొనుగోలు స్వామ్యంగా ఎలా మారిపోయిందో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు.
ఎన్నికలంటే ఓట్ల కొనుగోలు రేస్ !
ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మన కంటే చిన్న దేశాల్లోనూ ప్రజాస్వామ్యం ఉంది. మన కంటే ధనిక దేశాల్లోనూ ప్రజాస్వామ్యం ఉంది. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని వైరస్ సోకింది. అదే ఓట్లను డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం. కొన్నాళ్ల క్రితం వందల్లో ఉండే ఓటు రేటు ఇప్పుడు వేలకు చేరిపోయింది. ఓటర్లందరికీ కాకపోయినా మెజార్టీ ఓటర్లకు పంచేందుకు రాజకీయ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికనే తీసుకుంటే ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి దగ్గర్నుంచి ఓటర్లకు అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు రాజకీయ పార్టీల వైపు నుంచి రాలిన వరాలు లెక్క లేనన్ని. ఎన్నికలయిన తర్వాత ఇస్తామని చెప్పే వాటి గురించి లైట్ తీసుకున్నా… అప్పటికప్పుడు ఖర్చు పెట్టినవి వేల కోట్లకు చేరాయి. అందులో నేరుగా ప్రభుత్వం పెట్టిన ప్రజాధనమే రూ. మూడు వేల కోట్లకుపైగా ఉంటే రాజకీయ పార్టీల ఖర్చు ఎంతో అంచనా వేయడం కష్టం. అన్ని పార్టీలు కలిసి హుజురాబాద్‌లో కనీసం రూ. ఐదు వందల కోట్ల బ్లాక్ మనీని పారించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒక్క ఓటుకు రూ. ఆరు నుంచి పదివేలు ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు.
అవినీతి డబ్బుతో ప్రజాస్వామ్యానికి జబ్బు !
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం. అయితే ఇది బస్సుల్లో సీట్ల పైన రాసుకోవడానికి.. కొటేషన్లుగా చెప్పుకోవడానికే పనికి వస్తోంది. సోషల్ మీడియాల్లో నీతులు చెప్పే లక్షలాది మంది ఓటర్లు ఓటు దగ్గరకు వచ్చే సరికి డబ్బులు ఇస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఓటును అమ్ముకోవడం అంటే దేశాన్ని అమ్ముకోవడమేనని ఎంత ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం ఓటు డబ్బులను డిమాండ్ చేసి మరీ తీసుకునే పరిస్థితి వచ్చింది. నిరుపేదలు మాత్రమే కాదు.. చివరికి కోటీశ్వరులు కూడా తమ ఓటు డబ్బులు తమకు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. దానికి సాక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీచర్స్ నియోజకవర్గ ఎన్నికల్లో తాయిలాలు పంచిన వారే గెలుపొందడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలు వచ్చాయి అంటే పోటీ చేసే ఆర్థిక స్థోమత కలిగిన వ్యక్తులు కోట్లకు కోట్లు డబ్బులు వెదజల్లడం ప్రస్తుతం సహజమైన విషయంగా మారింది. డబ్బు ఉన్న వారికే రాజకీయ పట్టం, డబ్బులు లేని వారికి రాజకీయాల్లో చోటు లేదనే భావన మనదేశంలో చోటు చేసుకుంటోంది. ఇతర ప్రజాస్వామ్యదేశాలలో ఓటర్లను ప్రలోభపెట్టి డబ్బులు పంపిణీ చేసే ఆనవాయితీ ఇసుమంతైనా లేదు కానీ మనదేశంలో పోటీ చేసే అభ్యర్థులు వివిధ ప్రాంతా లలో కులాలు, మతాలు వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకుని వివిధ రూపాల్లో ఓట్లను కొనుగోలు చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకే మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది.
తమను దోచుకున్న డబ్బునే తమకు ఇస్తున్నారని తెలిసినా గుర్తించని ప్రజలు !
శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, చివరికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటి వాటిల్లోనూ ఓట్ల కొనుగోలు జరుగుతోంది. ప్రజాస్వామ్యం అంటే ఓట్లను కొనుగోలు చేయడమేకాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకొని ప్రజాసేవే పరమావధిగా పాటుపడేలా కృషి చేయడం. కానీ కోట్లకు కోట్లు డబ్బులు పంచి గెలిచిన అనంతరం వాటిని ఎలా సంపాదించుకోవాలో మాత్రమే సదరు ప్రజా ప్రతినిధి ఆలోచిస్తాడు. ప్రస్తుత ప్రజాప్రతినిధులలో తహతహ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలా ఓట్లకు అమ్ముడుపోయే ప్రక్రియ ఉంటే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదకరం. ఈ రోజు రూ. ఆరు వేలు పెట్టిన వారు రేపు రూ. ఇరవై వేలు ఇచ్చి ఓట్లు కొంటారు. అందులో ఎలాంటి సందేహం ఉండదు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదా ? రాజకీయ నేతదా ?
హుజురాబాద్ కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఎక్కడైనా కావొచ్చు రాజకీయ నేత ఓట్లకు డబ్బులు పంచుతున్నారంటే ఖచ్చితంగా అది వారి స్వార్జితం కాదు. రాజకీయ అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మే. ఆ సొమ్ము ప్రజలదే. రాష్ట్ర ప్రజలను దోచుకుని.. వనరులు కొల్లగొట్టి ప్రజల ఓట్ల కొనుగోలుకు కేటాయించి.. ప్రజాస్వామ్యాన్ని మన రాజకీయనేతలే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజలు కూడా వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆలోచన చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రజలు మాత్రం అలాంటి ఆలోచనలు చేయలేకపోతున్నారు. రాజకీయ నేతలు ఎవరూ వారి సొంత డబ్బులు పంచడం లేదు. ప్రభుత్వ పరంగా ఇచ్చే స్కీముల డబ్బులే కాదు ఓట్ల కొనుగోలుకు ఇచ్చే డబ్బులు కూడా వారి కష్టార్జితం కాదు. అదంతా ప్రజల సొమ్ము దోపిడి చేసిందే. ఈ విషయం ప్రజలకు తెలుసు. కానీ ఏ ఒక్క ప్రజలు కూడా తిరగబడి ప్రశ్నించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అక్కడ పంచే వారు ఒకరిద్దరు కాదు..అందరూ. ఎవర్ని నిలదీస్తారు. నిలదీస్తే వచ్చే ప్రయోజనం ఏముంది..? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని..తమకు తాము ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నామని .. హక్కులకు సంకెళ్లు వేసుకుంటున్నామని.. రాష్ట్ర భవిష్యత్‌ను అమ్మేస్తున్నామని తెలుసుకోకుండా పోటీ పడి డబ్బులు తీసుకుని మరీ ఓటేస్తున్నారు. ఈ జాడ్యం ఎంత దారుణంగా ప్రబలిపోయిందంటే టీచర్స్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వారూ డబ్బులు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి. ఇంత దారుణంగా కుళ్లిపోయిన పరిస్థితికి ప్రజాస్వామ్యం చేరిందనడంలో సందేహం లేదు.
ప్రజల్లో మార్పు ప్రారంభమైతేనే రాజకీయ నేతలు మారతారు ! లేకపోతే వినాశనమే !
అసెంబ్లీ ఎన్నికలయినా.. ఉపఎన్నికలయినా ఎవరినైనా తప్పు పడితే అది గొంగట్లో అన్నం తింటూ వెంట్రులను వెదికినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా తమకు ఓట్లు వేయరని భావించేవారికి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే… సొంత ఓటర్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిది. ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగితే గెలిచిన అభ్యర్థులు ఎవరూ నీతిగా ఉండేఅవకాశం లేదు. అవినీతి చేసి కోట్లకు పడగలెత్తి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ఎన్నికలంటే నోట్లకు ఓట్లు కొనుగోలు చేసి…ప్రజాప్రతినిధులు అవడం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లకు నోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం అనే విధానానికి రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు స్వస్తి చెపితేనే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే స్వేచ్ఛ మన చేతుల్లోఉంటుంది. లేకపోతే ముందు ముందు ఎవరు ఓట్లు కొనడంలో చాంపియన్ అవుతారో వారే గెలుస్తారు. అదే జరిగితే మన ప్రజాస్వామ్యం కాదు.. నియతృత్వం కూడా కాదు. అంతకు మించి చెప్పుకోలేని వ్యవస్థలోకి వెళ్లిపోతాం. అది ఎంత దుర్లభంగా ఉంటుందో..ఊహించడం కష్టం. ఈ విషయంలో ప్రజల్లోనే మొదట మార్పు రావాలి. ఓటుకు విలువ కట్టకుండా అమూల్యమైనదిగా గుర్తించాలి.