చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియదు. ఆయన పై స్థాయిలో బీజేపీ పెద్దల ఆశీస్సులు కోరుకుంటున్నారు. పొత్తులు పెట్టుకుని సీట్లిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయారు. టీడీపీతో పొత్తే లేదంటూ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ వంటి వారు అదే పనిగా ప్రకటనలు చేస్తూంటారు. ట్వీట్లు చేస్తూంటారు. అయితే వీరికి భిన్నంగా మాట్లాడారు ఎంపీ సీఎం రమేష్. పొత్తుల గురించి మాట్లాడటానికి వీరెవరని చర్చ ప్రారంభించారు.
బీజేపీ ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ అధ్యక్షుడని సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని ప్రకటించి కొత్తగా ఊహాగానాలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం రమేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్తగా చర్చనీయాంశం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీతో పొత్తు గురించి పెద్దగా స్పందించడం లేదు. ఆ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. జనసేన పార్టీ కలిసి వస్తామంటే టీడీపీ సంతోషంగా ఆహ్వానిస్తుంది.
సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు. సీఎం రమేష్ గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆయన టీడీపీ తరపునే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరుంది. ఈ క్రమంలో సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీజేపీలో మరో వర్గం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అసలు టీడీపీ నుంచి ప్రతిపాదన రాకుండానే రెండు వర్గాలు ఇలా రోడ్డున పడటం బీజేపీలో విచిత్ర పరిస్థితికి అద్దం పడుతోంది.