మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ ప్రారంభమయిదంి. ఏ ఉద్దేశంతో కేసీఆర్ ఏపీలో కూడా పార్టీ పెట్టి పోటీ చేస్తామని చెప్పారో కానీ అప్పట్నుంచి తెలంగాణ సమైక్యాంధ్రపై చర్చ జరుగుతోంది. రెండు చోట్ల పోటీ ఎందుకు కలిపేసి ఒకే రాష్ట్రగా చేసి పోరాడుదామని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నేతలకు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వెంటనే రేవంత్ రెడ్డి అందుకుని.. తెలంగాణను మళ్లీ ఏపీతో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అలా చేస్తే ఊరుకోబోమన్నారు. అయితే రేవంత్ రెడ్డికి భిన్నంగా జగ్గారెడ్డి స్పందించారు.
కేసీఆర్ సమైక్య రాష్ట్రాన్ని మళ్లీ తే దల్చుకుంటే దానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడం అనే అంశం హైలెట్ కావడం లేదు. ఎందుకంటే జగ్గారెడ్డి మొదటి నుంచి సమైక్యవాది. తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉండి.. జై తెలంగాణ అనని నేతలపై దాడులు జరుగుతున్న సమయంలో కూడా తాను సమైక్య వాదినని నేరుగా ప్రకటించుకున్నారు జగ్గారెడ్డి. విడిపోతే సమస్యలు వస్తాయన్నారు. ఆయన ఇప్పటికీ అదే వాదనకు కట్టుబడి ఉన్నారు. ఆ ప్రకారమే కేసీఆర్కు సపోర్ట్ చేస్తున్నారు.
కాంగ్రెస్లో ఒకరు రాష్ట్రాన్ని కలపాలని.. మరోకరు వద్దని వాదనలు ప్రారంభించారు. ఇది కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాల కన్నా.. టీఆర్ఎస్కు ఇబ్బందికరం. అందుకే ఈ చర్చలో జోక్యం చేసుకోవడానికి టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరు. ఏదో పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా పొగుడుతున్నారని చెప్పుకోవడానికి కేసీఆర్ అలా అంటే.. నిజంగానే ఎందుకీ చర్చ పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు గొణుక్కుంటున్నారు.