రాజకీయ అధికారం చేతిలో ఉంటే ఏం అయినా చేయవచ్చనడానికి అనేకానేక ఉదాహరణలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూంటాయి. మూడు రోజుల కిందట విజయవాడలో ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌గా దయాసాగర్ అనే అధికారి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన వస్తున్నారని వైసీపీ నేతలు హంగామా చేశారు. ఫ్లెక్సీలు వేశారు. స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అదాయపు పన్ను శాఖ అధికారికి వైసీపీ నేతలు ఇలా స్వాగత సత్కారాలు చెప్పడమేమిటని అందరూముక్కున వేలేసుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఆయన దయాసాగర్ అసలు పేరు మేకతోటి దయాసాగర్. ఈ ఇంటి పేరు వింటే మనకు హోంమంత్రి సుచరిత గుర్తుకు వస్తారు. ఆమే పూర్తి కూడా మేకతోటి సుచరిత .
అంటే అక్కడ లైట్ వెలగాలన్నమాట.. ఈ ఐటీ కమిషనర్ భార్యే హోంమంత్రి అన్నమాట. అందుకే వైసీపీ నేతలు .. కొత్త ఐటీ కమిషనర్ తమ వాడేనని స్వాగత సత్కారాలు పొందారు. అక్కడ పోస్టింగ్ పొందడానికి.. ఆయనకు అక్కడ పోస్టింగ్ ఇప్పించడానికి ఎంత పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగి ఉంటుందో ఊహించడం కష్టం. అసలే రాబోయేది ఎన్నికల కాలం. ఆదాయపు పన్ను శాఖ కమిషనరే తమ వాడయితే.. ఓ రాజకీయ పార్టీకి కావాల్సిందేముంటుంది.
అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం కొద్ది కొద్దిగా హైలెట్ అవుతోంది. త్వరలో వివాదాస్పదం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ ఐటీ అధికారుల కుటుంబాలు వైసీపీలో చాలా ఉన్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా మాజీ ఐటీ అధికారే. ఆయన భార్య ఇప్పటికీ ఆఫీసరే. మొత్తానికి వైసీపీలో ఏదైనా ఓ లెక్క ప్రకారం చేస్తారని ఇలాంటివి తెలిసినప్పుడే చాలా మంది అర్థం చేసుకుంటూ ఉంటారు.