శ్రీనివాస్ అంటే ఎస్సార్ అని క్లాస్‌రూమ్‌లో వినిపించే అరుపులు ఇక ఏపీలో వినిపించవు. ఎందుకంటే ఉద్యోగుల మాదిరి విద్యార్థులకూ బయోమెట్రిక్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అమలు ప్రారంభించేసింది. ఒక నెలలో మొత్తం రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. విద్యార్థులకు బయోమెట్రిక్ ఏమిటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ ప్రభుత్వానికో విజన్ ఉంది.
అదేమిటంటే.. ప్రభుత్వం అమ్మఒడి కింద ఇస్తున్న రూ. 15వేలు .. ఇందులో ఓ వెయ్యి మరుగుదొడ్ల శుభ్రత కోసం మినహాయించుకుని రూ. 14వేలే ఇస్తున్నారు. ఆ పదిహేను వేలు ఇవ్వాలంటే 75 శాతం హాజరు ఉండాలనేది నిబంధన. ఈ నిబంధను ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారని.. స్కూళ్లకు రాని వారిని కూడా వచ్చినట్లుగా చూపి.. రిజిస్టర్లలో 75 శాతం వేస్తున్నారన్న అనుమానంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తోంది.
అమ్మఒడి పథకం అన్ని స్కూళ్లకు ఇస్తున్నారు. అంటే ప్రైవేటు స్కూళ్లకు కూడా ఇస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు కూడా బయోమెట్రిక్ యంత్రాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందా లేదా ఎవరికి వారు సమకూర్చుకోవాలా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే గతంలో ఉద్యోగులకు బయోమెట్రిక్‌ను పెడితే వైసీపీ అధికార పత్రిక సాక్షిలో భయోమెట్రిక్ అని రాసేసి.. దాని వల్ల ఉద్యోగులకు వచ్చేసమస్యలను ఏకరవు పెట్టేవారు. ఇప్పుడు ఫీల్డ్ స్టాఫ్‌తో పాటు విద్యార్థులకూ బయోమెట్రిక్ పెట్టడాన్ని ఆ పత్రిక గొప్ప సంస్కరణగా ప్రచారం చేసుకుంటోంది.