కరోనా కారణంగా వాయిదా పడిన ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్రఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం అయినా కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 16, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ, నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారు.
అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఎలాంటి పోటీ లేకుండానే ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఆరుగురు.. ఏపీలో ముగ్గురు.. జూన్ మొదట్లో పదవీ విరమణ చేశారు. ఆ లోపు కొత్త వారిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేలో జరగాల్సి ఉంది. షెడ్యూల్ కూడా ఇచ్చారు. కానీ కరోనా విషయంలో ఎన్నికల సంఘాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మందలించడంతో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవి పబ్లిక్ ఎన్నికలు కాదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.
ఓటింగ్ జరిగే అవకాశం కూడా లేదు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఇదంతా లాంఛనమైన ప్రక్రియ అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఏ మాత్రం అలా ఆలోచించలేదు. వాయిదా వేసేసింది. మధ్యలో ఓ సారి తెలంగాణ సర్కార్ను ఈసీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అని కోరితే వద్దని సమాధానం పంపింది. ఇప్పుడు ఇక ఆలస్యం చేయడం ఎందుకని.. నేరుగా షెడ్యూల్ విడుదల చేసేసింది.