విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు సైలెంట్‌గా ఉన్న జనసేనాని చాలా రోజుల తర్వాత రంగంలోకి వచ్చి వారికి మద్దతుగా బహిరంగసభ నిర్వహించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్న కేంద్రాన్ని అసలు ప్రశ్నించలేదు.. కానీ ఏపీ ప్రభుత్వం.. అధికార పార్టీపై మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏం చేస్తారో చెప్పాలని వైసీపీకి వారం డెడ్ లైన్ !
వైసీపీ ఉక్కు పరిశ్రమ విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. ఏపీలో బంద్ చేస్తారు. ఢిల్లీలో మద్దతిస్తారు. అసలు ఉక్కు ప్రైవేటీకరణ అనేది పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని పార్లమెంట్ సాక్షిగా ఎప్పుడో బయటపడింది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే బాధ్యులను చేయాలని తేల్చేశారు. కేంద్రం మా మాట వినదని వైసీపీ నేతలు చెబుతున్నారని అలాంటప్పుడు సీఏఏ, వ్యవసాయ చట్టాలకు ఎందుకు మద్దచిచ్చారని ప్రశ్నించారు. మళ్లీ బంద్‌లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ నేతలు ఏం చేస్తారో వారంలో స్పష్టంగా చెప్పాలని డెడ్ లైన్ పెట్టారు .
మనం పోరాటం చేయకుండా కేంద్రాన్ని అడగడం తనకిష్టం లేదన్న జనసేనాని !
ప్రశ్నించడం సంగతి అటుంచితే పవన్ కల్యాణ్ కేంద్రాన్ని వెనకేసుకు వచ్చినట్లుగా మాట్లాడారు. మన పోరాటం మనం చేయకుండా.. కేంద్రాన్ని అనడం తనకిష్టం లేదని నేరుగా చెప్పారు.కార్మికుల కష్టాలు కేంద్రానికి ఏం తెలుస్తాయని ప్రసంగించారు. ఇక్కడి సమస్యలు తెలియవని.. మన ఎంపీలు కేంద్రానికి చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్నే పూర్తిగా దోషిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా స్పష్టమవుతోంది.
టీడీపీ ప్రభుత్వంపై అన్యాపదేశంగా పొగడ్తలు !
ఈ సమావేశంలో టీడీపీ ప్రభుత్వాన్ని అన్యాపదేశంగా పవన్ కల్యాణ్ పొగిడారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంది. కానీ పవన్ పోరాటం చేశారు. ప్రభుత్వం కూడా ప్రయత్నించడంతో ఆగిపోయింది. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటు పరం చేయాలనుకుంటే మన పోరాటానికి స్పందించిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం కాకుండా అపగలిగిందన్నారు. ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.