బద్వేలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేశారంటూ బీజేపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. కొన్ని వీడియోలను కూడా బయట పెట్టారు. వారు చేయగలిగింది అదేనా ? కేంద్రంలో అధికార పార్టీగా ఉండి.. అంతకు మించి వారు ఏం చేయలేరా..? చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా..?. ఇప్పుడే కాదు ఏపీ బీజేపీ వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే తేడాగా ఉంది. తమ పార్టీ కన్నా అధికార పార్టీకి నొప్పి కలగకూడదన్నట్లుగా వారి తీరు ఉంది.
తిరుపతిలో తాము పోటీ చేసి తీరుతామని జనసేనను ఒప్పించి బరిలోకి దించారు. కర్నాటక కేడర్ రిటైర్డ్ ఐఎఎస్‌ను తీసుకొచ్చి పోటీకి దింపారు. కనీసం ఆమెకు అన్నా గౌరవం ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. వంద బస్సుల్లో దొంగ ఓటర్లు తిరుపతికి వచ్చి ఓట్లేసినా కనీసం ఎన్నికల సంఘం నుంచి న్యాయమపరమైన పరిష్కారాన్ని కూడా చూపలేకపోయారు. కళ్ల ముందు కనిపించిన ఆ దొంగ ఓట్ల దందాను సైతం ఈసీ .. తూచ్ అనేసింది. దొంగ ఓటర్లు ఎవరూ రాలేదని తేల్చింది. కానీ బీజేపీ నేతలు కిక్కురుమనలేదు. ఏ పోరాటమూ సీరియస్‌గా చేయలేదు.
ఇప్పుడు బద్వేలులోనూ అదే పరిస్థితి. ప్రధానప్రతిపక్షం బరిలో లేనప్పటికీ బయట నుంచి దొంగ ఓటర్లను తెప్పించుకుని ఓట్లేయించుకోవడం ఏమిటో సామాన్యులకు అర్థం కాలేదు. బీజేపీ నేతలకూ అర్థం కాలేదు. కానీ వారు ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి తమకు తాము న్యాయం చేసుకునే ప్రయత్నాలు చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా ప్రెస్మీట్ల ముందు ప్రగల్భాలు పోవడం మినహా.. రియల్‌గా మాత్రం వైసీపీకి నొప్పి కలగకుండా వ్యవహరిస్తున్నారు. బీజేపీ హైకమాండ్‌కు కూడా ఏపీ బీజేపీ ఎలా పోయినా పర్వాలేదు.. వైసీపీని మాత్రం బాధపెట్టకూడదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా ఉండటం లేదు. వైసీపీకి ఆ అడ్వాంటేజ్ లభిస్తోంది.