వెబ్‌సీరిస్‌లలో లెస్బియన్లు అయిన ఇద్దరు అమ్మాయిలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం వంటి సీన్లు ఇప్పుడు రియల్‌గా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోబోతున్నారు. వారిద్దరూ గేలు, ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకుంటున్నారు. దానికి హైదరాబాద్‌నే వేదికగా చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బెంగాలీ, మరొకరు పంజాబీ. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు.
పెళ్లంటే ఆషామాషీగా కాదు.. మంగళస్నానాల దగ్గర్నుంచి సంగీత్ వరకూ అన్ని సంప్రదాయాలు పాటిస్తూ మూడు రోజుల పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పెళ్లికి వారి రెండు కుటుంబాలు అంగీకరించాయట. సుప్రియో, అభయ్అనే ఈ ఇద్దరూ ఇప్పుడు హైదరాబాద్‌లో తొలి గే మ్యారేజ్ చేసుకుంటున్న వారిగా రికార్డులకు ఎక్కబోతున్నారు. బెంగాల్‌కు చెందిన సుప్రియో హైదరాబాద్‌లో హోటల్ మెనేజ్మెంట్ స్కూల్లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన అభయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెళ్లి వచ్చే నెలలో డిసెంబర్లో జరగనుంది. దీని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు కూడా.
దేశంలో న్యాయస్థానం ఎల్జీబీటీ వివాహాలకు అనుమతి ఇచ్చింది. కానీ దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఎవరూ తాము లెస్బియన్ అని కానీ గే అని కానీ బయటపడే పరిస్థితి లేదు. వారికి సమాజంలో గౌరవం దక్కదు. అలాంటి స్థాయికి ఇంకా భారతీయుల మైండ్ సెడ్ మార్పు చెందలేదు. అదే సమయంలో కొన్ని హిందూ సంస్థలు ఇలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి.అవసరమైతే దాడులు చేస్తాయి. హైదరాబాద్‌లో అలాంటివి మరీ ఎక్కువ. మరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సుప్రియో, అభయ్‌ల పెళ్లి జరుగుతుందా.. లేకపోతే ఇలాంటి సంస్థల ఆందోళనలతో ఆగిపోతుందా అన్నది వచ్చే ఒకటి, రెండు నెలల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.