పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేయాలి అనుకోవాలే కానీ రోజుకు పదుల సంఖ్యలో కేసులు దొరుకుతాయి. ఎక్కడ చూసినా ఈ పేకాట శిబిరాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు ఏపీలోనూ ఇవి కుటీర పరిశ్రమలుగా మారిపోయాయని ఎప్పుడో చూశాం. కానీ హఠాత్తుగా సోమవారం అంతా ఓ పేకాట కేసుపై తెలుగు మీడియా డిపెండ్ అయిపోయింది. ఇంకేమీ లేనట్లుగా హడావుడి చేసింది. దీనికి కారణం ఆ పేకాట శిబిరం దొరికింది నటుడు నాగశౌర్య లీజుకు తీసుకున్న విల్లాలో. అంతే ఇంకేముంది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఓ వర్గం మీడియా రెచ్చిపోయింది.
నిజానికి పేకాట కేసులు అంటే.. ట్రెండ్ సెట్గా ఏపీ మంత్రి కొడాలి నాని మాటలు గుర్తు తెచ్చుకోవాలి. పేకాట ఆడితే ఏమవుతుంది.. యాభై రూపాయల ఫైన్ కట్టి మళ్లీవచ్చి బయట ఆడుకుంటారు అంతే.. ఉరేమీ వేయరు కదా..!” అంతే. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ అదే నిజం. ఒక్కో సారి ఆ యాభై కూడా కట్టరు. కానీ ఇక్కడ నాగశౌర్య అనే సినిమా పేరు వినిపించే సరికి మీడియాకు పూనకం వచ్చేసింది.
దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో వందల మంది పట్టుబడుతూ ఉంటారు. ఆ కేసులేమీ మీడియా దృష్టికి రావు. కానీ ఓ సెలబ్రిటీని పట్టుకుంటే మాత్రం చెలరేగిపోతారు. అతని వల్లే దేశం మొత్తం చెడిపోతోందన్నట్లుగా కవర్ చేస్తారు. అందుకే నేరాలు చేసినా.. వాటికి విలువ సెలబ్రిటీలు లింక్ అయినప్పుడే వస్తోంది. ఈ మీడియా అతి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టాల్లో ఇదీ ఒకటి.