జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాక ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో స్వయంగా లీడ్ తీసుకునేందుకు ముందుకు రావడంతో కదలిక కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కార్మికులు, ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు చేస్తూ పోరాడుతున్నారు. వారికి మద్దతుగా పవన్ బహిరంగసభ పెట్టడం.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో మళ్లీ విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్న ఆలోచన ఉద్యమకారుల్లో ప్రారంభమయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇతర సంఘాలు నిరసనలు ప్రారంభిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు రోడ్డెక్కుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ విషయం తెలిసి కూడా కొంత మంది స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు వైసీపీ నేతల నాయకత్వంలో ఉద్యమం నడిపించేందుకు ప్రయత్నించారు. విజయసాయిరెడ్డి ఏం చెబితే అది చేశారు. దాంతో ఇతర పార్టీల నేతలు మద్దతివ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో ఉద్యమం మెత్తబడింది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి మారుతోంది.
కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూంటే మమ్మల్ని ప్రశ్నిస్తారేమిటని వైసీపీ ప్రభుత్వం, మంత్రులు గింజుకుంటున్నారు. కానీ ప్రభుత్వంగా గట్టిగా వ్యతిరేకిస్తే కేంద్రం కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఆలోచిస్తుంది. ఆ స్టీల్ ప్లాంట్ ప్రజల ఉద్యమం ఫలితంగా ఏర్పాటయింది. అంతే కాదు భూమి ప్రజలు ఇచ్చింది. కొంత స్వచ్చందంగా ఇచ్చారు. మరికొంత సేకరించారు. అందుకే కేంద్రానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదని అల్టిమేటం జారీ చేస్తే కేంద్రం కూడా వెనక్కి తగ్గక తప్పదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రవేటీకరణకు సహకరిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది.