జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ-పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటు అయ్యే అవకాశాలుకనబడుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మొన్న శ్రీనగర్ వెళ్లి పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీతో చర్చలు జరిపారు. రెండు పార్టీల మధ్య గతంలో కుదిరిన ఒప్పందంలోని అంశాలను నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేస్తామని బీజేపీ తరపున రామ్ మాధవ్ హామీ ఇచ్చారు. అవసరమయితే మళ్ళీ ఈ విషయం గురించి మరోసారి చర్చిస్తామని తెలిపారు. తమ డిమాండ్లపై బీజేపీ సానుకూలంగా స్పందించడంతో పిడిపి కూడా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దం అవుతోంది.
అయితే ఆ రెండు పార్టీల మధ్య కురిదిన ఒప్పందం ఏమిటో..దాని అమలు కోసం పిడిపి ఎందుకు అంత పట్టుబట్టిందో, దానిని అమలు చేయడానికి ఇంతకాలం బీజేపీ ఎందుకు వెనకాడిందో..మళ్ళీ ఇప్పుడు ఎందుకు సిద్దం అవుతోందో తెలియదు. ఆ ఒప్పందంలో ఉన్న రాజకీయ అంశాలను అమలుచేయాలని మహబూబా ముఫ్తీ కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసారు.
మహబూబా ముఫ్తీ తండ్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పాక్ అనుకూలవాది కనుక పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని కోరుతుండేవారు. ఆయన హయంలో రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో ఆ షరతు కూడా చేర్చి ఉండవచ్చును. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటనకి వెళ్లి ఉండవచ్చును. కానీ తరువాత పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో భారత్-పాక్ దేశాల మధ్య పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి. భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం రద్దు అయ్యింది. ఒకవేళ భారత్ స్వయంగా చొరవ తీసుకొని పాక్ తో చర్చలకు సిద్దమయినట్లయితే అది పిడిపి ఒత్తిడి కారణంగానే అని భావించవలసి ఉంటుంది.