తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న సోమవారంనాడు ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రజలతో మాట్లాడుతూ “పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతాయనే ఉద్దేశ్యంతో ఖమ్మం జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసారు. వాటిని వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఆంధ్రా, తెలంగాణాలలో రెండు రాష్ట్రాలలో తెలుగువారే ఉన్నారు కనుక ఆంధ్రా అభివృద్ధికి తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది,” అని చెప్పారు.
ఆయన చెప్పిన మాటలు కలకలం సృష్టించాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగే అవకాశం లేనందునే చంద్రబాబు నాయుడు ఆ గ్రామాలను తెలంగాణా రాష్ట్రానికి వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు అంగీకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి ఆశించినంతగా సహాయం అందకపోవడంతో దేశంలో సంపన్న రాష్ట్రాలలో రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణా నుండి ఆర్ధిక సహాయం తీసుకొని, అందుకు బదులుగా ఏపిలో విలీనం చేసిన ఆ గ్రామాలను తెలంగాణాకు వెనక్కి తిరిగి ఇచ్చేయడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించి ఉండవచ్చని, అందుకే కేసీఆర్ ఆవిధంగా చెప్పి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది గ్రహించిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేసీఆర్ చెప్పిన విషయాన్నీ ఖండించారు. తమ ప్రభుత్వం అటువంటి ఆలోచన, ప్రతిపాదన ఏదీ చేయలేదని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ కూడా కేసీఆర్ చెప్పిన విషయాన్నీ ఖండించారు. ఆంధ్రాలో విలీనమయిన గ్రామాలను తెలంగాణాకు తిరిగి ఇచ్చే ప్రతిపాదనలేవీ చేయడం లేదని తేల్చి చెప్పారు.
అటువంటి ఆలోచన, ప్రతిపాదన ఏదీ చేయలేదని మంత్రి దేవినేని చెపుతున్నప్పుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిధంగా ఎందుకు అబద్దం చెప్పారనే సందేహం కలుగుతుంది. త్వరలో ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికే ఆ విధంగా చేసారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ జిల్లాలో ఇప్పుడు తెరాస చాలా బలంగా ఉంది. కనుక ఎన్నికలలో అవలీలగా గెలిచే అవకాశాలున్నప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి సాధ్యం కాని అటువంటి హామీలను ఇవ్వనవసరం లేదు. ఇస్తే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానిని ఖండిస్తుందని ఆయనకి తెలియదనుకోలేము. అపుడు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా కేసీఆర్ ఆవిధంగా చెప్పారంటే తెర వెనుక ఏదో జరుగుతోందని అనుమానించక తప్పదు.
కేసీఆర్ చెప్పిన ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఖండించలేదు. అయినా ఇదంతా రహస్యంగా జరుపగలిగే వ్యవహారం కాదు కనుక ఒకవేళ ఈ విషయంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఏదయినా రహస్య అవగాహన కుదిరి ఉండి ఉంటే, ఏదో ఒకరోజు దానిని అమలు చేయడానికి ఉపక్రమించినపుడు బయటపడుతుంది. ఒకవేళ కేసీఆర్ చెపుతున్నట్లు పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణాకు వాపసు చేసినట్లయితే ఇంకా ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కించేసినట్లే భావించవచ్చును.