తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించడానికి ముందూ వెనుకాడుతున్నాయి. అలాంటి ఆలోచనే లేదని ఏపీ ప్రభుత్వం సూచనలు పంపుతూండగా.. పరిశీలన చేస్తాం కానీ ఇప్పుడల్లా తగ్గించే అవకాశం లేదని తెలంగాణ చెబుతోంది. అయితే ఈ రెండు రాష్ట్రాలకు కర్ణాటకతో బోర్డర్ ఉంది. ఏపీ వైపున బెంగళూరు… తెలంగాణ వైపు రాయచూర్ ఉన్నాయి. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా తగ్గించింది. కేంద్రం రూ. ఐదు, పది తగ్గిస్తే కర్ణాటక కూడా పోటీగా రూ. ఏడు నుంచి పది వరకూ తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ రేటు 90కి వచ్చింది.
డిజిల్ రేటు ఇంకా తగ్గింది. కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం తగ్గించలేదు. కేంద్రం తగ్గించిన రూ. ఐదు , పది మాత్రమే తగ్గాయి. ఈ కారణంగా పెట్రోల్ రేటు తెలంగాణలో రూ. 108 వరకూ ఉంది. ఏపీలో రూ. 110వరకూ ఉంది. ఇప్పుడు కర్ణాటకతో పోలిస్తే ఎలా చూసినా రూ. పదిహేను వరకూ ఎక్కువ ఉంటుంది. అందుకే సరిహద్దుల్లో ఉన్నవారు.. అటు వైపు నుంచి వచ్చే వారు ట్యాంక్ ఫుల్ చేయించుకుని వస్తున్నారు. ఇంకా కావాలంటే క్యాన్లలో స్టాక్ పెట్టుకుని వస్తున్నారు.
ఒక వేళ ప్రభుత్వాలు రేట్లను తగ్గించకపోతే పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెచ్చినట్లుగా పెట్రోల్, డీజిల్‌ను కూడా తీసుకొచ్చి అమ్మినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లీటర్‌కు రూ. పదిహేను వరకూ లాభం అంటే స్మగ్లర్లకు అంత కంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాలు చురుకుగా ఆలోచించి పొరుగు రాష్ట్రాలతో సమానంగా రేట్లు ఉండేలా చూసుకోవాలని లేకపోతే రాష్ట్రానికే నష్టమని హెచ్చరికలు పంపుతున్నారు నిపుణులు.