ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రైతులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన చుట్టూ ఓ హత్య కేసు వివాదం ముసురుకుంటోంది. ఆయన మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు విశాఖలో ఓ విద్యుత్ లైన్మెన్ను చంపేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రి బొత్స మేనల్లుడైన కారణంగా పోలీసులు కేసులు కూడా పెట్టడం లేదన్న గుసగుసలు విశాఖ మొత్తం వ్యాపించాయి. నాలుగు రోజుల కిందట పద్మనాభంలో లైన్మెన్ బంగార్రాజు బొత్స మేనల్లుడుకి చెందిన గెస్ట్ హౌస్ పక్కన విగత జీవిగా పడి ఉన్నాడు.
అతడ్ని హత్య చేశారని బంధువులు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయించలేదు. దీంతో బంగార్రాజు బంధువులు ఆందోళనకు దిగారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు, మరో వ్యక్తి గోవిందు కలిసి హతమార్చారని వారు చెబుతున్నారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారు రూ.కోటికి పైగా డబ్బులు తీసుకుని..ఉద్యోగాలు ఇప్పించలేదు. ఈ విషయం మాట్లాడేందుకు బంగ్రాజును పిలిచి లక్ష్మణరావు గెస్ట్ హౌస్లో హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
యాదవ సంఘాలు , రాజకీయ పార్టీలు ఆ కుటుంబానికి మద్దతుగా రోడ్డు మీద ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డీజీపీకి లేఖ రాశారు. తక్షణం నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే బొత్స మేనల్లుడి పేరును కేసులో చేర్చడం కానీ.. కనీసం దర్యాప్తు చేసే ధైర్యం కానీ పోలీసులు చేయడం లేదు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం జరగడం కష్టమని విమర్శలు వినిపిస్తున్నాయి.