తిరుపతిలో పథ్నాలుగో తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.దీనికి అమిత్ షా నేతృత్వం వహిస్తారు. దీనికి దక్షిణాది ముఖ్యమంత్రులందరూ హాజరవ్వాల్సి ఉంది. ఆతిధ్య రాష్ట్రం కాబట్టి ఏపీ సీఎం జగన్ తప్ప హాజరవుతారు. అయితే తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నుంచి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక పర్యటన ఖరారు కాలేదు. సీఎం జగన్ సమీక్ష నిర్వహించి ప్రత్యేకహోదాను లేవనెత్తాలని కూడా నిర్ణయించారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏం లేవనెత్తాలన్నదానిపై సమీక్ష కూడా చేయలేదు.
ఇప్పటికి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారనే ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అత్యున్నత స్థాయి సమావేశం కాబట్టి కేసీఆర్ హాజరు కాకపోయినా ప్రతినిధి బృందం మాత్రం ఖచ్చితంగా పాల్గొనాలి. అందుకే ఉన్నతాధికారులు తెలంగాణ తరఫున ప్రస్తావించాల్సిన అంశాలన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. విభజన చట్టంలోని తొమ్మిదవ, పదవ షెడ్యూలు అంశాలతో పాటు ప్రధానికి సమర్పించిన విజ్ఞాపన పత్రాలు, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి లభించిన హామీలు తదితరాలను రెడీ చేస్తున్నారు.
విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు, వివిధ సంస్థల ఆస్తులు-అప్పుల పంపిణీ, ఉద్యోగుల విభజన, విద్యుత్ సంబంధ వివాదాలు.. ఇలా అనేకం ఈ సమావేశంలో లేవనెత్తాలని భావిస్తున్నారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్ట్ నెంట్ గవర్నర్లు కూడా సమావేశానికి హాజరవుతారు.