ప్రపంచంలో దేశాలను పరిపాలిస్తున్న వారిలో నెంబర్ వన్ భారత ప్రధాని నరేంద్రమోడీ. ఈ విషయాన్ని మార్నింగ్ కన్సల్ట్ అనే ప్రైవేటు సంస్థ ప్రకటించింది. ఇలా ఆ సంస్థ మార్నింగ్ ప్రకటిచగానే… ఈవినింగ్ కల్లా దేశం మొత్తం హోరెత్తిపోయింది. ప్రపంచానికి నాయకత్వం వహించగల ఏకైక లీడర్ మోడీ అని బీజేపీ నేతలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మోడీ నాయకత్వానికి 70 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. 13 మంది అభివృద్ధి చెందిన దేశాల నేతల కంటే ముందుగా ఉన్నారు. ఇటలి ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ , అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ల కంటే మోదీ ముందున్నాపు, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రతి దేశంలో ఆన్ లైన్ ఇంటర్యూల ద్వారాఈ రేటింగ్లు ఇస్తుంది. ఇండియాలో 2 వేల 126 మందిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఫలితాలను ప్రకటించింది.
ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థను గతంలో ఎప్పుడూ వినలేదని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనికి దశాబ్దాల చరిత్ర ఏమీ లేదు. అంత పెద్ద పేరున్న సంస్థ కూడా ఏమీ కాదు. ఏడేళ్ల కిందటే 2014లో అమెరికాలో ప్రారభమయింది. డేటా ఇంటలిజెన్స్ కంపెనీగా నమోదు చేసుకుంది. కొంత మంది ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది మేలోనే రూపర్డ్ మర్దోక్ పెట్టుబడి పెట్టడంతో కాస్త లైమ్ లైట్లోకి వచ్చింది. ఈ సంస్థకు ఉన్న ఉద్యోగులు 255 మంది మాత్రమే.
ప్రకటించిన సంస్థ ఏమిటి..? ఎలా ప్రకటించింది ?దానికి ఉన్న విలువ ఏమిటి? అన్నది తర్వాతి విషయం… మన దేశంలో ఇష్టమైన రాజకీయ నేతల్ని పొగిడారు అంటే సోషల్ మీడియాలో వీరతాళ్లువేయడానికి పార్టీల కార్యకర్తలు రెడీగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే న్యూయార్క్ టైమ్స్ లాంటి వాటి మాస్ట్ హెడ్ ను ఉపయోగించుకుని ఫేక్ పోస్టులు తయారు చేసి కూడా అభినందనుల వర్షం కురిపిస్తూంటారు.అదే మన దేశ రాజకీయం స్టైల్… కాబట్టి అభినందించడం తప్ప..మనమేం చేయలేం. !