ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికి రెండు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ పుస్తకాలు పిల్లలు రాసుకోవడానికో లేకపోతే మరో అవసరానికి ఉపయోగపడేవో కాదు.. రాజన్న రాజ్యంలో జరిగిన పథకాలు, వింతలు, విశేషాలు, గొప్పలు, అనుభూతులు తెలిపేవి. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ ప్లానింగ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఎంత ఖర్చు అవుతుందో నేరుగా చెప్పలేదు కానీ.. గతంలో ఇలాంటి పబ్లిసిటీ క్యాంపైన్లు చేసినప్పుడు దాదాపుగా వంద కోట్లు ఖర్చయింది.ఈ సారి కూడా అయ్యే అవకాశం ఉంది.
రెండు పుస్తకాల్లో మొదటి దాని పేరు ” రెండో ఏట ఇచ్చిన మాటకే పెద్దపీట -జగనన్న మేనిఫెస్టో”. ఈ పుస్తకంలో వైసీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు.. దాన్ని ఎలా పక్కాగా అమలు చేశారో కథలు, కథలుగా చెబుతారు. అంటే… రైతు భరోసా పథకానికి రూ. 13500 ఎలా ఇస్తున్నారు.. సున్నా వడ్డీ పథకం ఎంత బాగా అమలు చేస్తున్నారో.. అమ్మఒడి పథకానికి ఎంత సులువుగా డబ్బులు జమ చేస్తున్నారు ఇలాంటివన్నీ వివరిస్తారు. ఇప్పటికే 98 శాతం హామీలు అమలు చేశామని జగన్ ప్రకటించేశారు. ఆ మేరకు పుస్తకంలో వివరాలుంటాయి.
ఇక రెండో పుస్తకం పేరు ” సంక్షేమ సంతకం రెండో ఏట – ఇచ్చిన మాటకే పెద్దపీట ” మొదటి పుస్తకానికి ఉన్న పేరునే అటూఇటూ మార్చినట్లుగా ఉంది. లోపల మ్యాటర్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఇంత మాత్రం దానికి రెండు పుస్తకాలు ఎందుకు అన్నదానిపై స్పష్టత లేదు. రెండు పుస్తకాల్లోనూ జగన్ మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారని చెప్పడమే టార్గెట్. ఇప్పటికే ఈ పుస్తకాల ప్రింటింగ్ పూర్తయింది. జిల్లాలకు పంపిణీ కూడా ప్రారంభమయింది. నేడో రేపో వాలంటీర్లు ఇంటింటికి వాటిని పంపిణీ చేసే చాన్స్ ఉంది.
ప్రజలపై పన్నుల భారం మోపుతూ.. కనీస కనికరం లేకుండా పైసా కూడా తగ్గించకుండా పబ్లిసిటీ కోసం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోంది.