బండ్ల గణేష్ హాస్య నటుడిగా తెలుసు. నిర్మాతగా తెలుసు. తన స్పీచులు, వేసే ట్వీట్లలో బోలెడంత కామెడీ ఉంటుంది. అలాంటి బండ్ల గణేష్ సీరియస్ గా ఓ పాత్ర చేస్తే.. ఎలా ఉంటుంది? ఈ ఆలోచన నుంచి పుట్టిందే `డేగల బాబ్జీ`. తమిళ సినిమా `ఒరుత్త సెరుప్పు సైజ్ 7` కి ఇది రీమేక్. వెంకట్ చంద్ర దర్శకుడు. తమిళంలో.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. హిందీ లో ఈ చిత్రాన్ని అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో గణేష్ నటించాడు.
ఈరోజు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల ట్రైలర్ లో బండ్ల గణేష్ తప్ప.. ఇంకెవరూ కనిపించలేదు. ఈ సినిమా మొత్తంలోనూ ఒకేఒక్క పాత్ర ఉంటుంది. ఒకే ఒక్క లొకేషన్ లో సినిమా పూర్తవుతుంది. అదే దీని ప్రత్యేకత. అయితే కొన్ని వాయిస్ లు మాత్రం వినిపిస్తుంటాయి. గణేష్ ని ఇంత సీరియస్ రోల్ లో చూడడం ఇదే ప్రధమం. ఓ మర్డర్ కేసులో దొరికిన నిందుతుడ్ని పోలీస్ విచారణ చేయడం, పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి తన అనుభవాల్ని, జీవితాల్ని ఆవిష్కరించడం… స్థూలంగా ఇదే కథ.
`సంతూరు కాదుసార్.. సొంతూరు`
`పుట్టగానే వాడు ఏడ్వలేదు.కానీ వాడు పుట్టినప్పటి నుంచీ నేను ఏడుస్తూనే ఉన్నా`
`అసలు అమ్మ అందంగానే ఉండాలన్న రూలేమైనా ఉందా`
– మరుధూరి రాజా రాసిన ఇలాంటి డైలాగులు కొన్ని… ట్రైలర్లో బాగానే వినిపించాయి. ఒకే పాత్ర.. ఒకే లొకేషన్ అంటే ప్రయోగమే అనుకోవాలి. కాకపోతే… బండ్ల గణేష్ ఒక్కడినే అంత సేపు ప్రేక్షకులు చూస్తారా? అనేది పెద్ద సందేహం. దాన్ని దాటుకుని వస్తేనే ఈ ప్రయోగానికి ఓ ప్రయోజనం ఉంటుంది.