చిన్న చిన్న సినిమాలతో పెద్ద స్థాయికి ఎదిగాడు మారుతి. తనకిప్పుడు స్టార్స్ తో సినిమా చేసే హోదా వచ్చేసినట్టే. కానీ…ఈ విషయంలో మారుతి ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తన కంఫర్ట్ జోన్ విడిచి బయటకు రావడానికి మారుతికి ఇష్టం లేదు. అల్లు అర్జున్ తో మారుతి ఎప్పుడో ఓ సినిమా చేయాల్సింది. కానీ… మంచి టైమ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోగా.. చిరుతో ఓ సినిమా ఫిక్సయ్యింది కూడా. ఇప్పుడు ప్రభాస్ తోనూ మారుతి ఓ సినిమా చేస్తున్నాడని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికీ ఓ కారణం ఉంది. యూవీ అంటే మారుతికి సొంత సంస్థ లాంటిది. `నేను సినిమా తీస్తా` అంటే కథేమిటన్నది అడక్కుండానే మారుతి చేతిలో బడ్జెట్ పెట్టేంత నమ్మకం యూవీకి ఉంది. యూవీ అంటేనే ప్రభాస్, ప్రభాస్ అంటేనే యూవీ కాబట్టి.. మారుతికి ప్రభాస్‌కీ మంచి రాపో ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.
వీటిపై మారుతి తెలుగు 360తో మాట్లాడారు. ”ఈమధ్య ప్రభాస్ తో సినిమా చేస్తున్నానని కొన్ని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. నేనెప్పుడూ.. హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాసుకోను. నా కథకు ఎవరైతే బాగుంటారో, వాళ్ల దగ్గరకు వెళ్తా. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నాకూ ఉంది. మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్ తలుపు తడతా. అయితే ఇప్పుడొస్తున్న వార్తల్లో నిజం లేదు” అని క్లారిటీ ఇచ్చేశారు.