సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తారని భయపడే ఆయనపై ఐటీ దాడులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఈ విషయంలో ఆయనకు తాము అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. సోనుసూద్, కేటీఆర్ హైదరాబాద్‌లో జరిగిన కోవిడ్ వారియర్స్ కు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురి ప్రసంగాల్లో ఒకరినొకరు విపరీతంగా పొగుడుకున్నారు. ఈ సందర్బంలో ఐటీ దాడులు రాజకీయ కక్ష సాధింపులన్న పద్దతిలో కేటీఆర్ మాట్లాడారు.
ఒక్క ఐటీ దాడులే కాకుండా సోనుసూద్‌ను విపరీతంగా పొగడటానికి కేటీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. కోవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా మనవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదని, సోనూసూద్ వంటివారి చేయూత ఎంతైనా అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోనుసూద్ కూడా కేటీఆర్‌ను ప్రశంసించారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ తనకు కనిపించిందన్నారు. ఆ వ్యవస్థ కేటీఆర్ ఆఫీస్ అని సోనుసూద్ గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండబోదన్నారు.
సోనుసూద్, కేటీఆర్ మధ్య ఈ ర్యాపో ఇప్పటిది కాదు. చాలా రోజుల నుంచి ఉంది. గతంలో ట్వీట్లలోనూ ఒకరినొకరు పొగుడు.మీరు రియల్ హీరో అంటే మీరు రియల్ హీరో అని ప్రశంసలు కురిపించుకున్నారు. ఇప్పుడా అవకాశం నేరుగా వచ్ిచంది . అదే చెప్పుకున్నారు. అయితే సోనుసూద్‌పై ఐటీ దాడుల అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించి వేధింపులుగా చెప్పడం.. తాము అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాస్త భిన్నంగా కనిపిస్తోంది.