యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి తెలంగాణాలో తెరాసను విలీనం చేసుకొని అక్కడ తిరుగులేని రాజకీయ శక్తిగా నిలవాలనుకోవడం. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో…జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని కలలుకంటే, తెరాసయే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తనలో విలీనం చేసేసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ విధంగానయినా తన కోరిక నెరవేరుతోందని కాంగ్రెస్ అధిష్టానం సంతోషించాల్సిన దుస్థితి నెలకొంది.
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలయిన నేతలున్నప్పటికీ వారందరూ కేసీఆర్ వ్యూహాలని సమర్ధంగా ఎదుర్కొనలేక చేతులెత్తేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలలో వరుసపరాజయాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్న సాయంత్రం తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలతో హైదరాబాద్ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. పార్టీ వరుస ఓటమికి కారణాలు అడిగి తెలుసుకొన్నారు. ఇప్పుడు ఆయనే కాదు…సాక్షాత్ రాహుల్ గాంధి దిగివచ్చినా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాలేరని స్పష్టమవుతోంది. కనుక మళ్ళీ పరిస్థితులు మారేవరకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బారి నుండి కాపాడుకోగలగితే అదే గొప్ప విషయం అవుతుంది.
ఇక రాష్ట్ర విభజనతోనే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయిందని చెప్పవచ్చును. అప్పటి నుండి కోలుకోనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా వేరే పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ తెదేపా విఫలమయినా ఆ ప్రయోజనం వైకాపా దక్కించుకోగలదు తప్ప కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొందామని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేసింది కానీ అవి కూడా ఫలించలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. మిగిలినవారందరూ రాహుల్ గాంధి, దిగ్విజయ సింగ్ వంటి నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడే మొహాలు చూపిస్తున్నారు. మరికొందరు పార్టీ మారడం కోసం తగిన సమయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఆంద్ర రత్న భవన్’ ని ప్రారంభించడానికి దిగ్విజయ సింగ్ ఈరోజు వస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆరంభించడం నవ్వు తెప్పిస్తోంది.
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు నేటికీ ఆ పార్టీని దూరంగా ఉంచుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా, వారి అభిప్రాయాలకు, మనోభావాలకు, ఉద్యమాలకు ఏమాత్రం విలువనీయకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎప్పటికయినా ఆదరిస్తారా? అంటే అనుమానమే. తెదేపా, వైకాపా, బీజేపీ మూడు పార్టీలు పూర్తిగా విఫలమయితేనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారేమో?కనుక అంతవరకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా కాపాడుకొంటారో చూడాల్సిందే.