వాళ్లు స్కూల్ పిల్లలన్న కనీస జ్ఞానం కూడా రాలేదు. వారేమీ చట్టవిరుద్ధమైన నిరసన చేపట్టడం లేదన్న ఆలోచన కూడా రాలేదు. ఆడపిల్లలన్న సానుభూతి కూడా లేదు. లాఠీలు విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్లుగా బాదేశారు. చేతికి అందిన వారిని కార్లలో కుక్కి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దృశ్యాలు అనంతపురంలో చోటు చేసుకున్నాయి. ఆ పిల్లలు చేసిన తప్పు.. తమ ఎయిడెడ్ స్కూల్ మూసివేయవద్దని స్కూల్ ఆవరణలో ధర్నా చేయడమే.
అనంతపురంలో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల సుదీర్ఘ కాలంగా ఉంది. కొన్ని వందల మంది అక్కడ చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల దానికి ఎయిడ్ ఉపసంహరించుకుంది. దాంతో యాజమాన్యం స్కూల్ మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. స్కూల్ ఉంటుందనుకుని వెళ్లిన విద్యార్థులకు తమ స్కూల్ లేదని తెలిసి షాకయ్యారు. స్కూల్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. కాసేపటికి అక్కడకు పోలీసులు వచ్చారు. వచ్చి రావడంతోనే విద్యార్థులపై విరుచుకుపడ్డారు. దాంతో వారు చెల్లాచెదురరయ్యారు. కానీ పోలీసులు దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టారు. మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేసిన కొంత మందిని పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెల్లారు.
విద్యార్థులపై దాడి చేసిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. పోలీసులు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయారు. విద్యార్థులనే కనికరం లేకుండా ఎలాంటి చట్ట విరుద్ధ ఆందోళనలు చేయకుండానే దాడులకు పాల్పడటం చాలా మందిని నివ్వెరపరిచింది. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా పోలీసులు, ప్రభుత్వం ఈ ఘటనపై పెద్దగా స్పందించలేదు.
గతంలో అమరావతి రైతులపై ఎలాంటి దమన కాండ జరిగిందో ఇప్పుడు ఎయిడెడ్ విద్యార్థులపైనా అదే తరహాలో విరుచుకుపడుతున్నారు. ఇలా ఒకటి రెండు చోట్ల కొడితే మిగిలిన చోట్ల రోడ్డు మీదకు రావడానికి భయపడాతరన్న ఉద్దేశంతో ఇలా విరుచుకుపడుతున్నారన్న అభిప్రాయం ఇతరుల్లో ఏర్పడుతోంది. సహజంగానే ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఒక్క వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీల నేతలూ ఖండించారు.