జగన్ అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకమైన హెటెరో విషయంలో పక్కా సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ హైకోర్టుకు తెలియచేయడం సంచలనాత్మకం అవుతోంది. హెటెరో హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసింది. ఇందులో సీబీఐ ..పక్కాగా మోసం జరిగిందని.. అవినీతి జరిగిందని స్పష్టం చేస్తూ వాదనలు వినిపించింది. అంతే కాదు.. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెటిరో హెల్త్‌కేర్‌లో విచారణ జరిపి నిగ్గు తేల్చిందని స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పుడు సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
హెటెరో పెట్టుబడుల గుట్టుపై కేంద్రం వద్ద నివేదిక !
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద కూడా ఈ క్విడ్ ప్రో కో నివేదిక, స్పష్టమైన సాక్ష్యాలు ఉంటే ఇక బయటపడటం అసాధ్యమని భావిస్తున్నారు. కేంద్రం వద్ద ఉన్న నివేదిక ప్రకారం హెటిరో హెల్త్‌కేర్‌లో జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. కానీ హెటెరో వాటాలను విక్రయించుకునే అవకాశం లేకుండా, లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. ఇదే విషయాన్ని సీబీఐ చాలా స్పష్టంగా హైకోర్టుకు తెలిపింది.
జగన్ ఒక్క రూపాయి పెట్టలేదు కానీ జగతిలోకి రూ. 1200 కోట్ల పెట్టుబడులు!
ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.1,200 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టారని సీబీఐ తెలిపింది. పెట్టుబడులు పెట్టడం… వారికి సంబంధించిన ఫైళ్లు అప్పటి ప్రభుత్వంలో ముందుకు కదలడం జరిగాయన్నారు. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే. జగన్ రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్ ఏసియా, సండూర్ పవర్ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్ రాబట్టారు అని సీబీఐ లెక్క చెప్పింది.
విజయసాయిరెడ్డి దొంగ లెక్కల నివేదికలు !
హెటిరో పెట్టిన పెట్టుబడులను సమర్థించుకోవడానికి వీలుగా విజయసాయిరెడ్డి డెల్లాయిట్ నుంచి పాత తేదీతో వాల్యుయేషన్ నివేదిక తెప్పించారని సీబీఐ స్పష్టం చేసింది. వాటాల విక్రయానికి అవకాశం లేదని, లాభాలు లేవని.. అన్నీ తెలిసి.. ఇతర ప్రయోజనాలు పొందడానికే పెట్టుబడులు పెట్టాయని సీబీఐ తెలిపింది. ఎప్పుడెప్పుడు హెటెరో పెట్టుబడి పెట్టింది..ఎప్పుడు భూములు కేటాయించారు వివరాలన్నీసీబీఐ చెప్పింది. ఈ ఆరోపణలకు సంబంధించిన వాదనలను జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ రోజు వినిపించనున్నారు.