కేసుల మీద కేసులతో రెండున్నర నెలల పాటు జైల్లో గడిపిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సోమవారం విడుదలయ్యారు. 30కిపైగా కేసుల్లో బెయిల్ రావడం.. ఆరు కేసులు కొట్టి వేయడంతో ఆయనకు రిలీఫ్ దక్కింది. బయటకు వచ్చిన ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది తెలంగాణ రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకంచే మల్లన్నకు సొంతంగా రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో రావడంతోనే యువతలోఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని స్పష్టమయింది.
అరెస్ట్ చేయడానికి ముందే ఆయన ఓ పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. కానీ అరెస్ట్ చేయడంతో అది వాయిదా పడింది. ఆయన జైల్లో ఉన్న సమయంలో విడుదల కోసమో.. మరో కారణమో కానీ బీజేపీలో చేరుతానని ఆ పార్టీ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. స్వయంగా ఆయన సతీమణిని తీసుకెళ్లి అమిత్ షాతో కలిపించారు ఎంపీ అర్వింద్. తీన్మార్ మల్లన్న కూడా లేఖ రాశారు. అదేమైనా ఉపయోగపడిందో లేదో కానీ ఇప్పుడు బీజేపీలో చేరే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఆయన రిలీజై గంటలు కూడా కాలేదు కాబట్టి కొంత కాలం ఆగి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే గతంలోలా ఉంటే మళ్లీ కేసులు పెట్టి జైల్లో పెడతారని.. అది తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందికరమని తీన్మార్ మల్లన్న భావిస్తున్నట్లుగా తెలుస్తోంది . అందుకే దూకుడు తగ్గించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్‌లో భారీ ఫాలోయింగ్ పెంచుకున్న చానల్లోనూ ఆయన కొన్నాళ్లు కనబడే అవకాశం లేదు.