తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి ఎలాగూ ఏకగ్రీవం అవుతాయి. ఆశావహుల్ని ఖరారు చేసే ప్రయత్నంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికార పార్టీలకు కాస్త రిలీఫ్ లభించింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కూడా ఈసీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 11 , తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
నామినేషన్లను నవంబర్ 16నుంచి స్వీకరిస్తారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగుతుంది. 14న కౌంటింగ్ ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికం గెల్చుకుంది. ఈ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. అత్యధికంగా స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్ నేతలే.
కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పెట్టే అవకాశం ఉంది. రెండు అధికార పార్టీలకు అభ్యర్థుల ఎంపికే సవాల్ గా మారింది. ఆశవాహులు చాలా ఎక్కువ మంది ఉండటమే కారణం. ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో రెండు అధికార పార్టీల ఆశావహుల్లో సందడి నెలకొంది. తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.