ఈ దీపావళిన టాలీవుడ్ టపాసు తుస్సుమంది. ఒకే రోజు మూడు సినిమాలు విడుదలైనా.. `హిట్` టాక్ మాత్రం వినిపించలేదు. దీపావళికి వచ్చే సినిమాలు పెద్దగా ఆడవన్న బ్యాడ్ సెంటిమెంట్ ఈ యేడాదీ కొనసాగింది. ఆ పరాభవాన్ని మరిపించడానికి ఈ వారం కూడా జోరుగా సినిమాలు వస్తున్నాయి. విచిత్రంగా… పాత సినిమా టైటిళ్లు పెట్టుకున్న రెండు సినిమాలు ఒకే రోజున బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టుకోబోతున్నాయి. అవే… రాజా విక్రమార్క, పుష్షక విమానం.
కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం రాజా విక్రమార్క. బేసిగ్గా… చిరంజీవి ఫ్యాన్ అయిన కార్తికేయ, చిరు పాత టైటిల్ ని వాడుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కార్తికేయ కూడా ”చిరు పేరు కాబట్టే.. ఎనర్జిటిక్ గా కనిపించింది. అందుకే పెట్టుకున్నా” అని చెప్పేశాడు. కాకపోతే.. అప్పటి రాజా విక్రమార్క ఫ్లాపు. మరి… ఆ టైటిల్ కార్తికేయకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఇందులో కార్తికేయ ఓ ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా నటిస్తున్నాడు. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. దాంతో పాటుగా ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తోంది చిత్రబృందం. ఆర్.ఎక్స్ 100 తరవాత అలాంటి హిట్టు కార్తికేయ ఖాతాలో పడలేదు. కానీ జోరుగా సినిమాలైతే వస్తున్నాయి. మరో హిట్టు పడితే.. రెండేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకునే తీరిక కూడా ఉండదు. అలాంటి హిట్టు ఈ సినిమాతో దక్కుతుందని కార్తికేయ ఆశ పడుతున్నాడు.
ఆనంద్ దేవరకొండ సినిమా ‘పుష్షక విమానం’ కూడా ఈవారమే విడుదల అవుతోంది. పుష్షక విమానం… అంటే కమల్ హాసన్ మూకీ సినిమా గుర్తుకు రావడం ఖాయం. అదో క్లాసిక్. అలాంటి టైటిల్ ని పెట్టుకోవడం నిజంగా సాహసమే. దొరసాని ఫ్లాప్ అయినా… మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఆకట్టుకున్నాడు ఆనంద్. తన చేతినిండా చాలా సినిమాలున్నాయి. అన్న విజయ్ దేవరకండ అండతో… ప్లానింగ్ కూడా పక్కాగా చేసుకుంటున్నాడు. ఈ సినిమాకీ భారీ ఎత్తున ప్రమోషన్లు జరుగుతున్నాయి. సినిమాపై కాన్ఫిడెన్స్ వచ్చిందో ఏమో… ఒక్క రోజు ముందే ప్రీమియర్లు వేసేస్తున్నారు. ప్రచార చిత్రాలతో పాటు పాటలూ.. బాగున్నాయి. ఆనంద్ కి ఈ పుష్షక విమానం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. వీటితో పాటు శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన ‘తెలంగాణ దేవుడు’ కూడా ఈ శుక్రవారమే విడుదల అవుతోంది. కానీ… ఈ రెండు సినిమాల మధ్య శ్రీకాంత్ సినిమా ప్రమోషన్లు లేక బోసిబోతోంది.