హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలకు మంత్రి హరీష్ రావును బలిపశువు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఆయనకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావును పక్కన పెట్టుకుని ప్రెస్మీట్లు పెట్టడమే కాదు.. ఆయనకు కొత్తగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు వైద్యారోగ్య శాఖను కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ తమిళి సై సంతకం చేశారు. ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. దీంతో ఈటల రాజేందర్ నిర్వహించిన శాఖలోకి హరీష్ అధికారికంగా ఎంటర్అవుతున్నారు. ఇప్పటి వరకూ అనధికారికంగా ఆయనే ఆ శాఖను చూస్తున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ఇంచార్జ్‌గా హరీష్ రావు పని చేశారు. కేవలం హరీష్‌ను బలిపశువును చేసేందుకే కేసీఆర్ ఇలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఇతర పార్టీలు అదే చెబుతున్నాయి. ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా కేసీఆర్ హరీష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై బాగా అవగాహన ఉన్న వారు మాత్రం హరీష్‌కు ఇది ప్రాధాన్యం కాదని.. చెక్ పెట్టేందుకు కేసీఆర్ వేస్తున్న ఎత్తునలని అంటున్నారు. టీఆర్ఎస్ లో వైద్య ఆరోగ్య మంత్రిగా పని చేసిన ఎవరికీ సానుకూల పరిస్థితులు రాలేదు. మొదటగా ఉపముఖ్యమంత్రి కమ్ వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను అవమానకరంగా బయటకు పంపేశారు. ఆయనకు మరెక్కడా చోటు దక్కే పరిస్థితి లేకపోవడంతో టీఆర్ఎస్లోనే ఉంటున్నారు.
అయితే ఈటల రాజేందర్ వేరు కాబట్టి.. వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న ఆయన… వెంటనే తిరగబడ్డారు. ఇప్పుడు ఆ శాఖ హరీష్ చేతికి వచ్చింది. ఇప్పటికి బాగానే ఉంటుందని.. మామ కేసీఆర్ రాజకీయ ఎత్తులను హరీష్ రావు ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉండకపోతే.. ఆయనకూ ఈటలకు పట్టిన గతే పడుతుదంని కొంత మంది సలహాలిస్తూనే ఉన్నారు. అయితే హరీష్ రావు… మామ హరీష్‌ను మించిన రాజకీయ నాయకుడని నమ్మేవాళ్లు టీఆర్ఎస్లో ఎక్కువగానే ఉన్నారు. అందుకే హరీష్ వైద్య ఆరోగ్య శాఖ సెంటిమెంట్‌ను మార్చేస్తారని నమ్ముతున్నారు.