ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బ్యాంకులకు నమ్మకం కలగడం లేదు. ప్రభుత్వ పరంగా హామీఇస్తామంటే రుణాలు ఇవ్వడం లేదు. ఆస్తులు తాకట్టు పెట్టాలని కోరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రుణాలకు విశాఖలో పలు కీలకమైన ఆస్తులను తనఖా పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను తనఖా పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల స్థలాలు, విస్తీర్ణం, వాటి మార్కెట్ విలువ వంటి వాటిని అందచేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు వారు సమాచారం పంపుతున్నారు.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటు చేసిన ఆస్పత్రులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అవన్నీ వందల ఎకరాల్లో ఉన్నాయి. కొన్ని వేల కోట్ల విలువ ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించాలని శంకుస్థాపన చేసింది. వాటికి నిధుల్లేవు. వాటి కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులను నాడు – నేడు పేరుతో అభివృద్ధి చేస్తామని చెబుతోంది. కానీ నిధుల్లేవు. అప్పులు పుట్టే మార్గం లేదు. ఆర్బీఐ నుంచి లేదా ఇతర మార్గాల నుంచి చేసే అప్పులు ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు సరిపోతాయి. అభివృద్ధి పనులకు ఇలా కార్పొరేషన్లకు ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రభుత్వ ఆస్పత్రులను కూడా తాకట్టు పెడితే ఆ తర్వాత ఇక కలెక్టరేట్లు, సచివాలయం వంటివి మిగులుతాయి. వాటిని కూడా తాకట్టు పెట్టడానికి మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండున్నరేళ్లు కాక ముందే అనాదిగా వస్తున్న ప్రజా ఆస్తుల్ని దాదాపుగా మొత్తం ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తున్నట్లయింది. ఇప్పటి వరకూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సంపద సృష్టించి ఆ సంపదను అమ్మే ప్రయత్నం చేశారే కానీ మార్కెట్లు, కలెక్టరేట్లు, ఆస్పత్రులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్న ఆలోచన చేయలేదు. మొదటి సారి చరిత్రలో నే మొదటి సారిగా.. జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన చేసి అమలు చేస్తున్నారు.